GHMC: మోడీ సభకు జీహెచ్ఎంసీ సహాయనిరాకరణ

GHMC: పరేడ్ గ్రౌండ్ లో పనులకు దూరంగా ఉన్న గ్రేటర్ యంత్రాంగం

Update: 2022-07-03 09:08 GMT

GHMC: మోడీ సభకు జీహెచ్ఎంసీ సహాయనిరాకరణ 

GHMC: తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ పాలిటిక్స్ పీక్ స్టేజ్ లోకి వెళ్లాయి. బీజేపీ కార్యవర్గ సమావేశాలకు అవకాశం ఉన్నంత మేర బ్రేక్ లు వేసేందుకు టీఆర్ఎస్ ప్రయత్నాలు చేస్తూనే ఉంది. ఫ్లెక్సీలు పెట్టుకునేందుకు ప్లేస్ కూడా లేకుండా చేసిన టీఆర్ఎస్ శ్రేణులు ఇప్పుడు ఏకంగా మోడీ మీటింగ్ నే టార్గెట్ చేశారు. ప్రధానితో పాటు పలువురు కేంద్రమంత్రులు, ప్రముఖులు పాల్గొనే పరేడ్ గ్రౌండ్ సభకు జీహెచ్ఎంసీ యంత్రాంగం ఏమాత్రం సహకరించడం లేదు. రాజకీయంగా ఎన్ని ట్రిక్కులు ప్లే చేసినా అధికారిక కార్యక్రమాలకు కూడా అడ్డంకులు సృష్టించడమే చర్చనీయాంశంగా మారింది. ఫక్త్‌ పార్టీ మీటింగ్ అయినా ప్రధాని సభ కాబట్టి స్థానిక అధికారులు ఏర్పాట్లు చేయాలి. కానీ జీహెచ్ఎంసీ యంత్రాంగం నుంచి సహాయనిరాకరణ ఎదురవుతోంది.

వాస్తవానికి పరేడ్ గ్రౌండ్ కంటోన్మెంట్ పరిధిలోకి వస్తుంది. దీంతో గ్రౌండ్ లో ఏం జరగాలన్నా కంటోన్మెంట్ బోర్డే నిర్వహించాల్సి వచ్చేది. కానీ గతంలో ఎన్నో సభలు, సమావేశాల సమయంలో కంటోన్మెంట్ బోర్డుకు గ్రేటర్ సహకారం అందించడం వల్లే అవి సక్సెస్ అయ్యాయి. అయితే ఈ సారి మాత్రం కేవలం కంటోన్మెంట్ బోర్డ్ కు చెందిన కార్మికులు మాత్రమే పనులు చేస్తున్నారు. ముఖ్యంగా పరేడ్ గ్రౌండ్ కు వెళ్లే మార్గాలు శుభ్రం చేయడం మురుగు నీటి లీకేజీలు నివారించడం.. ఆయా ప్రాంతాలను సుందరంగా మార్చడం గ్రౌండ్ ను సభకు అనుకూలంగా సిద్ధం చేయడం వంటి ఎన్నో పనులు చేయాల్సి ఉన్నా గ్రేటర్ యంత్రాంగం పట్టించుకోవడం లేదు.

అయితే ప్రధాని బహిరంగ సభ విషయంలో జీహెచ్‌ఎంసీ వ్యవహరిస్తున్న తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. కంటోన్మెంట్‌ బోర్డు యంత్రాంగమే అంతా తామై పనులు పూర్తి చేస్తున్నాయి. అయితే వర్షం పడే అవకాశం ఉండటంతో సహాయ సహకారాలు అందించాలని కంటోన్మెంట్ బోర్డ్ తో కలిసి బీజేపీ నాయకులు గ్రేటర్ యంత్రాంగానికి విజ్ఞప్తి చేశారు. పనుల కోసం ఖర్చు మొత్తాన్ని పార్టీ భరిస్తుందని కూడా స్పష్టం చేశారు. అయితే గ్రేటర్ నుంచి సానుకూల స్పందన కరువైంది. దీంతో కంటోన్మెంట్ బోర్డు యంత్రాంగమే అన్ని పనులు చేపట్టాల్సి వచ్చింది. 

Tags:    

Similar News