భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను వదలని వరదలు

Update: 2019-08-18 03:08 GMT

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో విస్తారంగా కురుస్తున్న వర్షాలతో వాగులు, వంకలు ఉగ్రరూపం దాల్చాయి. గుండాల మండల పరిధిలోని మల్లన్నవాగు ఉదృతంగా ప్రవహిస్తుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో జనం నానా అవస్థలు పడుతున్నారు. వరదనీరు ఊర్లను చుట్టేయడంతో కనీస అవసరాలు తీర్చుకునేందుకు నరకయాతన పడుతున్నారు. కనీసం తాగేందుకు మంచినీరు, వైద్యసేవలు అందుబాటులో లేక అల్లాడిపోతున్నారు. తాజాగా నర్పాపురం తాండలో వెలుగుచూసిన ఘటన అందరిని కలిచివేస్తోంది.

ఎటుచూసినా వరదే కనిపించడంతో చావు కూడా నర్సాపురం తాండవాసులకు శాపంగా మారింది. కుటుంబకలహాలతో ఓ మహిళ పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. దీనిని గమనించిన స్థానికులు వెంటనే మల్లన్న వాగును దాటుకుని 108లో ఆస్పత్రికి తరలించారు. ఆమె పరిస్థితి విషయంగా ఉండటంతో ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆమె ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మరణించింది.

మరణించిన మహిళ మృతదేహాన్ని గ్రామానికి చేర్చడం సవాల్‌గా మారింది. గ్రామాన్ని వరదనీరు చుట్టేయడంతో ఏం చేయాలో అర్థంకాక తలలుపట్టుకున్నారు. కనీసం డెడ్‌బాడీని వాహనంలో తరలించేందుకు కూడా వీలులేకపోవడంతో... చేసేది లేక శవాన్ని భూజాన మోసుకుని వాగు దాటారు. ప్రాణాలకు ప్రమాదం అని తెలిసినా ప్రాణాలను అరచేతపట్టుకుని... వాగుదాటారు. శవానికి దహనసంస్కారాలు నిర్వహించేందుకు గ్రామస్తులు పడ్డ అవస్థలు వర్ణనాతీతం.

మొన్నటికి మొన్న పురిటినొప్పులతో అవస్థలు పడ్డ గర్భిణి ఘటన మరువక ముందే మరో ఘటన వెలుగు చూడటంతో గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అయిన వారిని కోల్పోయిన ఆ కుటుంబీకుల కళ్లలో పోటెత్తున్న నీరు వరదతో పోటీ పడుతోంది. ఆత్మీయులను కోల్పోయిన దుఃఖం, మృతదేహాలకు అంతిమ సంస్కారం ఎలా చేయాలన్న ఆందోళన వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి.

Tags:    

Similar News