ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్ట్‌కు వరద

Kadem project: 18 గేట్లకు 17 గేట్ల నుంచి నీటి విడుదల

Update: 2022-07-13 08:35 GMT

ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్ట్‌కు వరద

Kadem project: కడెం ప్రాజెక్ట్‌ డేంజర్‌ జోన్‌కు చేరుకుంది. ప్రమాదకర స్థాయిలో కడెం ప్రాజెక్ట్‌కు వరద పోటెత్తుతోంది. దీంతో 18 గేట్లకు గాను 17 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు అధికారులు. మరొక గేటు తెరుచుకోక మొరాయిస్తోంది. గత 5రోజులుగా క్రమంగా వరద పెరుగుతుండటంతో ఇన్‌ఫ్లో 5 లక్షలు గాను, ఔట్‌ ఫ్లో 3 లక్షలుగాను కొనసాగుతోంది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 694.17 అడుగులకు నీటిమట్టం చేరుకుంది.

అయితే 1995 సంవత్సరంలో కడెం ప్రాజెక్టుకు గండి పడింది. మళ్లీ 27 ఏళ్ల తర్వాత డేంజర్‌ బెల్స్‌ మోగించింది ప్రాజెక్ట్. ఇక.. తేదీల వారీగా ప్రాజెక్ట్‌ వివరాలు చూస్తే.. జులై 9న ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 64వేల క్యూసెక్కులుగా ఉండటంతో 9 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. ఇక.. జులై 10న ఇన్‌ఫ్లో 87 వేల 258 క్యూసెక్కులుగా ఉండగా.. ఔట్‌ఫ్లో లక్షా 15 వేల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో 13 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేశారు.

జులై 11న ఎగువ నుంచి వరద ఉధృతి తగ్గడంతో అన్ని గేట్లు మూసివేశారు. ఇన్‌ఫ్లో 12 వేల 353 క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 100 క్యూసెక్కులుగా ఉంది. దీంతో ఎడమ కాలువ ద్వారా 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇక జులై 12న అనూహ్యంగా కడెం ప్రాజెక్టుకు వరద పెరిగింది. ఇన్‌ఫ్లో 2 లక్షల 5 వేల క్యూసెక్కులు కాగా ఔట్‌ఫ్లో 2 లక్షల 38 వేల క్యూసెక్కులకు చేరుకుంది. దీంతో 9 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేశారు. ఇవాళ ప్రమాదకర స్థాయిలో వరద వచ్చి చేరుతోంది. ఇన్‌ఫ్లో 5 లక్షల క్యూసెక్కులకు పైగా ఉండగా 3 లక్షల క్యూసెక్కులకు పైగా ఔట్‌ఫ్లో ఉంది. దీంతో 17 గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.

Tags:    

Similar News