Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఫ్యామిలీ వార్
Congress: కుటుంబసభ్యులకు టికెట్ కేటాయించాలని సీనియర్ల పట్టు
Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఫ్యామిలీ వార్
Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో ఫ్యామిలీ వార్ తారా స్థాయికి చేరుకుంది. కుటుంబసభ్యులకు టికెట్ కేటాయించాలని పలువురు సీనియర్ల పట్టుబడుతున్నారు. ఒకే కుటుంబం నుంచి రెండు,మూడు దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో ఎవరికి టికెట్ కేటాయించాలని ఎవరికి టికెట్ నిరాకరించాలన్న సందిగ్ధంలో పీఈసీ పడినట్లు తెలుస్తోంది. టికెట్ కేటాయించాలని పలువురు నేతలు ఇప్పటికే పట్టుబడుతున్నారు. దీంతో ఈ డబుల్ టికెట్ పంచాయితీ గాంధీ భవన్‌లో పతాక స్థాయికి చేరుకుంది.
ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపై రేవంత్, ఉత్తమ్ మధ్య మాటల యుద్ధం జరిగినట్లు తెలుస్తోంది. రెండు టికెట్ల అంశంపై పీసీసీ చీఫ్ హైకమాండ్‌కు చెప్పాలని ఉత్తమ్ సూచించగా... తనను డిక్టేట్ చేయవద్దంటూ రేవంత్ ఉత్తమ్‌పై అసహనం వ్యక్తం చేసినట్లు కాంగ్రెస్‌లో చర్చ జరుగుతోంది. ఎవరిని టార్గెట్ చేసిన చర్చ జరుపుతున్నారంటూ ఉత్తమ్ వెళ్లిపోయినట్లు కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. మరో సీనియర్ నేత మహేశ్ కుమార్ గౌడ్ ఎదుటే ఈ పంచాయితీ జరిగిందని కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
ఒకే కుటుంబంలో రెండు టికెట్ల అంశం... ఉత్తమ్‌కే పరిమితం కాలేదని గాంధీ భవన్ వర్గాలు అంటున్నాయి. ముషీరాబాద్ నుంచి అంజన్‌కుమార్‌యాదవ్, ఆయన కుమారుడు అనిల్‌కుమార్‌యాదవ్, కరీంనగర్ నుంచి సీఎం కేసీఆర్ అన్న కూతురు రమ్యారావు ఆమె కుమారుడు రితేష్‌రావు, నాగార్జునసాగర్, మిర్యాలగూడ నుంచి జానారెడ్డి కుమారులు రఘవీర్‌రెడ్డి, రణ్‌ధీర్‌రెడ్డి, అందోల్ నుంచి దామోదర రాజనరసింహతో ఆయన కూతురు త్రిష, ములుగు నుంచి సీతక్క, పినపాక నుంచి ఆమె కూమారుడు సూర్యం, హుజూర్‌నగర్ నుంచి ఉత్తమ్‌కుమార్, కోదాడ నుంచి ఉత్తమ్‌పద్మావతి దరఖాస్తులు పెట్టుకున్నారు.
మరో సీనియర్ నాయకుడు జానారెడ్డి. ఈయన ఈసారి పోటీలో ఉండటం లేదు. కాకపోతే ఆయన ఇద్దరు కుమారులను బరిలో దించే ఆలోచనలో ఉన్నారు. తన రాజకీయ వారసులైన రఘువీర్‌రెడ్డి, రణ్‌ధీర్‌రెడ్డిలను రంగంలోకి దించేందుకు దరఖాస్తులు పెట్టుకున్నారు. తనకు వ్యక్తిగతంగా మంచి పట్టు ఉన్న నాగార్జునసాగర్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇప్పటికే కుటుంబంలో రెండు టికెట్ల అంశంపై ఉత్తమ్, రేవంత్ మధ్య వార్ ప్రారంభం కాగా... తర్వాత ఆ జాబితాలోకి మరి కొందరు నేతలు చేరతారని గాంధీ భవన్ వేదికగా చర్చ జరుగుతోంది. డబుల్ టికెట్ సమస్యలు అధిష్టానం ఎలా పరిష‌్కరిస్తుందని పార్టీ నేతలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఎవరికి కాదన్న అసంతృప్తి సెగలు పుడతాయన్న అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఉత్తమ్, రేవంత్ మధ్య జరిగిన వాగ్వాదానికి ప్రత్యక్షంగా చూసినట్లుగా చెప్పబడుతున్న సీనియర్ కాంగ్రెస్ నేత మహేశ్ కుమార్ గౌడ్ ఉదయ్ పూర్ డిక్లరేషన్ పైన కూడా మాట్లాడటానికి ప్రస్తుతం రెడీగా ఉన్నారు.