రవీందర్‌ పరాజయంతో ఈటలకు బైపోల్‌ కిక్కు హాంఫట్టేనా?

Etela Rajender: అతను గెలుస్తాడు...తనను నిలుపుతాడు...ఎదురులేని నేతగా అధిష్టానం దృష్టిలో పడేలా చేస్తాడని, ఆయన అనుకున్నారు.

Update: 2021-12-15 09:39 GMT

రవీందర్‌ పరాజయంతో ఈటలకు బైపోల్‌ కిక్కు హాంఫట్టేనా?

Etela Rajender: అతను గెలుస్తాడు...తనను నిలుపుతాడు...ఎదురులేని నేతగా అధిష్టానం దృష్టిలో పడేలా చేస్తాడని, ఆయన అనుకున్నారు. వెనకుండి చాలా కష్టపడ్డారు. ధనం ధారపోశారు. కానీ, అన్ని కాలాలు మనవి కాదు. అన్ని విజయాలు మనకు దక్కవు. ఇప్పుడదే జరిగింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈటల రాజేందర్‌కు కుడిభుజంలాంటి సర్దార్‌ సింగ్‌ ఓడిపోయాడు. దీంతో ఈటల ప్లాన్స్ అన్నీ రివర్సయ్యాయి. సర్దార్‌ ఓటమితో ఈటలపై గులాబీదళమైతే కసి తీర్చుకుంది. మరి ఈటల పరపతి నెక్ట్స్ ఏంటి? సకల శక్తులనూ ధారపోసినా రవీందర్‌ను గెలిపించుకోలేకపోవడం, ముందుముందు ఈటలకు ఎలాంటి ఇబ్బందులు సృష్టించే అవకాశం వుంది?

సర్దార్‌ ఓటమితో ఈటలకు హుజూరాబాద్‌ హ్యాంగోవర్ దిగిందా? రవీందర్‌ పరాజయంతో ఈటలకు బైపోల్‌ కిక్కు హాంఫట్టేనా? అనవసరంగా సర్దార్‌ కోసం పంతానికి పోయానని మథనమా? ఎమ్మెల్సీ పోరు ఓటమితో ఈటలకు ఎందుకంత దిగులు? ఊరకున్నంత ఉత్తమం లేదు. బోడిగుండంత సుఖంలేదన్నది సామెత. అనవసర ప్రతిష్టలకు పోయిన ఈటల రాజేందర్‌కు, ఈ మాట సరిగ్గా వర్తిస్తుందన్నది టాక్‌ ఆఫ్‌ ది టౌన్.

హుజూరాబాద్‌ స్టన్నింగ్‌ విక్టరీతో ఈటల రాజేందర్‌ పేరు మార్మోగింది. ఒక్కసారిగా ప్రతిష్ట ఎక్కడికో వెళ్లిపోయింది. కొత్త కాపురం మొదలెట్టిన కమలం ఇంటిలో పరపతి పెరిగింది. ఇదే గెలుపును ఎంజాయ్‌ చెయ్యకుండా, పార్టీలో మరింత గ్రిప్‌ పెంచుకోకుండా, విక్టరీ కొట్టిన కిక్కులో తడబడ్డారు ఈటల. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీనే గెలుస్తుందని తెలిసినా, సర్వేలు ఘోషించినా తన అనుచరుడు, కరీంనగర్‌ మాజీ మేయర్ రవీందర్‌ సింగ్‌ను‌‌ బరిలోకి దింపారు.

ఓడిపోతామని నిర్ధారించుకున్న బీజేపీ, పోటీకి దూరమని చెప్పింది. అయినా, ఈటల వినలేదు. కనీసం స్వతంత్ర అభ‌్యర్థిగానైనా రంగంలోకి దించుతానని పట్టుబట్టారట. క్రాస్‌ ఓటింగ్ జరుగుతుందని, స్థానిక సంస్థల్లో తమకు పట్టుందని, సర్దార్‌ను గెలిపించి, మండలిలో బీజేపీకి గిఫ్ట్ ఇస్తానన్నారట. ఈటల మంకుపట్టుపై కొంత అసహనంగానే వున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం, తమకేం సంబంధంలేదని చెప్పిందట. అయినా, గెలుపుపై ధీమాతో రవీందర్‌ను బరిలోకి దింపారు ఈటల. దీంతో నిజంగానే, కరీంనగర్ ఎమ్మెల్సీ స్థానం రసపట్టులా మారింది. కానీ అసలే హుజూరాబాద్ పరాజయంతో కసిమీదున్న కేసీఆర్, ఈటలకు గట్టి షాకిచ్చి, హుజూరాబాద్ కైపు దించాలనుకున్నారు.

రవీందర్‌ సింగ్‌ వెనక ఈటల బలంగా నిలబడ్డారు. ఓటింగ్ రోజు కూడా సర్దార్‌ను గెలిపించాలని పిలుపునిచ్చారు. సర్దార్‌ ప్రచారానికి కావాల్సిన అంగబలం, అర్థబలం సమకూర్చారు. ఇవన్నీ గమనించిన కేసీఆర్, స్థానిక సంస్థల సభ్యులెవరూ జారిపోకుండా జాగ్రత్తపడ్డారు. గోవా, బెంగళూరుల్లో క్యాంపు రాజకీయాలు నడిపించారు. ఓటింగ్ రోజూ వరకు, వారిని గంపకింద కోడిపిల్లలా కాపాడుకున్నారు. చివరికి కేసీఆర్ వ్యూహమే గెలిచింది. ఆరుస్థానాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గులాబీ క్లీన్‌స్వీప్ చేసింది. ఈటల అత్యంత ప్రతిష్టాత్మకంగా యుద్ధంలోకి దింపిన, సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ సైతం ఓడిపోయారు. దీంతో ఒక్కసారిగా ఈటలకు గర్వభంగమైందంటూ గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకున్నాయి. ఒకరకంగా హుజూరాబాద్‌‌ విజయానికి, ఈటలపై ప్రతీకారం తీర్చుకున్నట్టయ్యింది కేసీఆర్.

కరీంనగర్ స్థానంలో సర్దార్ రవీందర్ సింగ్ ఓడిపోయారు. మరి నెక్ట్ ఏంటి? ఈటల పరిస్థితి ఏంటి? ఈ పరాజయం ఈటలకు ఏవిధంగా నష్టమన్నది ఇప్పుడు నడుస్తున్న చర్చ. హుజూరాబాద్ గెలుపు తర్వాత బీజేపీలో ఈటల ఇంపార్టెన్స్ పెరిగింది. ఢిల్లీ పెద్దలే స్వయంగా ఈటలను అభినందించారు. కేసీఆర్‌ను ధాటిగా ఎదుర్కొనే నేతగా చూశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా గెలుపు బాధ్యతలు పూర్తిగా అప్పగించడంతో పాటు, రాష్ట్రమంతా ప్రచారం చేయించాలని తలంచారు. ఎవరినైనా గెలిపించుకు తీసుకువస్తారని అంచనా వేశారు. ఈటల కూడా అదే ఉత్సాహంతోనే, సర్దార్ రవీందర్ సింగ్‌ గెలుపును ఎత్తుకున్నారు. ఆయన ఓడిపోయారు. దీంతో అధిష్టానం దృష్టిలో ఈటల ప్రతిష్ట పలుచనైనట్టేనని కొందరు రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు. అనవసరంగా రవీందర్‌ గెలుపుపై ఈటల బీరాలకు పోయి, పరువు పోగొట్టుకున్నారని పార్టీలో కొందరు మాట్లాడుకుంటున్నారు.

రవీందర్‌ పరాజయంతో ఈటల నొచ్చుకోవడంతో, బీజేపీ రాష్ట్ర పార్టీలో కొందరు లోలోపల కుషీ అవుతున్నారట. పార్టీలో మొన్నమొన్న వచ్చి, ఒక్క బైపోల్ విజయంతో పరపతి పెంచుకుని, ఢిల్లీ అధిష్టానం దృష్టిలో పడిన ఈటలకు, తన అనుచరుడి ఓటమితో దిమ్మతిరిగిందని మాట్లాడుకుంటున్నారట. ఇక ముందు బీజేపీలో ఈటలకు అంత ప్రాధాన్యత వుండదని, తగ్గుతుందని అంటున్నారట. అటు టీఆర్ఎస్‌‌లోనూ ఇలాంటి చర్చే జరుగుతోందట. కేసీఆర్‌కు వ్యతిరేకంగా జెండా ఎగరేసిన ఈటలకు, రవీందర్‌ ఓటమితో షాకిచ్చినట్టయ్యిందని, ఇక ఈటల గమ్మనుంటారని డిస్కస్ చేసుకుంటున్నారట.

మొత్తానికి ఈటల సైలెంట్‌గా వుండివుంటే, తన ప్రత్యర్థుల నుంచి ఇన్ని దెప్పిపొడుపులు వచ్చేవికావంటున్నారట అనుచరులు. హుజూరాబాద్‌ ఊపులో లోకల్‌గా ఎవర్నయినా గెలిపిస్తానని ఓవర్‌కాన్ఫిడెన్స్‌కు పోవడం బెడిసికొట్టిందంటున్నారట. అయినా ఒక్క ఓటమితో పోయేదేముందని, కేసీఆర్‌కు వ్యతిరేకంగా బలమైన వాయిస్ ఈటలదేనంటూ మాట్లాడుకుంటున్నారట ఫాలోవర్స్. మొత్తానికి ఒక పరాజయంపై ఇంత రచ్చ జరుగుతోంది. ఎవరి హ్యాపీ వారిదే. ఎవరి బాధలు వారివే.

Tags:    

Similar News