రవీందర్‌ సింగ్‌పై కాషాయంలో కొత్త రచ్చ.. గెలిస్తే కమలంలో కొత్త సమీకరణలా?

Telangana: తెలంగాణలో అత్యంత ఉత్కంఠగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఒకే ఒక్కస్థానం, అంతకుమించి అన్నట్టుగా ప్రకంపనలు రేపుతోంది.

Update: 2021-12-04 15:30 GMT

రవీందర్‌ సింగ్‌పై కాషాయంలో కొత్త రచ్చ.. గెలిస్తే కమలంలో కొత్త సమీకరణలా?

Telangana: తెలంగాణలో అత్యంత ఉత్కంఠగా మారిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో, ఒకే ఒక్కస్థానం, అంతకుమించి అన్నట్టుగా ప్రకంపనలు రేపుతోంది. అది కూడా భారతీయ జనతా పార్టీలో. కరీంనగర్‌ స్థానిక సంస్థల స్థానం నుంచి పోటీ చేస్తున్న సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ వ్యవహారం, కాషాయంలో కథాకళి ఆడిస్తోంది. ఈటల పట్టుబట్ట మరీ సర్దార్‌ను స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దించడంతో, పార్టీలోనే రచ్చ సాగుతోంది. మరి సపోజ్,పర్‌సపోజ్ రవీందర్‌ సింగ్ గనుక గెలిస్తే, స్టేట్ బీజేపీలో అంతర్యుద్ధమేనా? ఈటలకు పట్టపగ్గాలుండవని, ఒక వర్గం రగిలిపోతోందా? నిజంగా సర్దార్‌ గెలిస్తే, బీజేపీలో రేగే ప్రకంపనలేంటి?

తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికలు ఉత్కంఠ రేపుతున్నాయి. అనేక రాజకీయ పరిణామాలకు సైతం దారి తియ్యడం ఖాయమన్న చర్చనూ రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీలో కొత్త చిచ్చుకు నిప్పుపెడుతున్నాయన్న మాటలు రీసౌండ్‌నిస్తున్నాయి. స్వతంత్ర అభ్యర్థిగా ఈటల రాజేందర్‌ బలపరిచిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్‌ రవీందర్‌ సింగ్‌ చుట్టూ ఎమ్మెల్సీ పొలిటికల్‌ వార్‌ చక్కర్లు కొడుతోంది. కమలంలో నయా లొల్లికి శ్రీకారం చుడుతోంది.

తెలంగాణలో ఎమ్మెల్యే కోటాలోని 6 స్థానాల మాదిరిగానే, స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీలనూ ఏకగ్రీవం చేసుకుకోడానికి అధికార టీఆర్ఎస్ శతవిధాలా ప్రయత్నించింది. అయినా, కేవలం 6 ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన ఆరు చోట్ల ఎన్నికలు అనివార్యం కాగా, రెబల్స్ బెడద, తిరుగుబాట్లతో కరీంనగర్ జిల్లా ఎమ్మెల్సీ ఎలక్షన్, హైఓల్టేజ్ క్రియేట్ చేస్తోంది. జిల్లాలోని రెండు ఎమ్మెల్సీ స్థానాలకు టీఆర్ఎస్ నుంచి ఎల్.రమణ, భానుప్రసాద్ సహా మొత్తం 10 మంది పోటీలో సై అంటున్నారు. మిగతా అభ్యర్థులు అందరిలోకి మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ తాను పక్కాగా గెలుస్తానని కాన్ఫిడెన్స్ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే టీఆర్ఎస్ తన ఎంపీటీసీ, జెడ్పీటీసీ, వార్డు మెంబర్, సర్పంచ్, కార్పొరేటర్లను బెంగళూరు, ముంబై, గోవాలోని క్యాంపులకు తరలించింది. అయితే, రవీందర్‌ సింగ్‌ గెలిస్తే ఒక సంచలనమే కాదు, బీజేపీలో ప్రకంపనలు సృష్టించడం ఖాయమన్న చర్చా జరుగుతోంది.

సర్దార్‌ రవీందర్‌ సింగ్, ఈటల రాజేందర్‌కు నమ్మినబంటు. కరీంనగర్‌ మేయర్‌గా రవీందర్‌ వున్నప్పుడు, అటు మంత్రిగా ఈటల, ఇద్దరూ చక్రం తిప్పారు. అయితే, ఈటల వర్గంగా ముద్రపడటంతో, రవీందర్‌సింగ్‌ను పక్కనపెట్టేసింది టీఆర్ఎస్. దీంతో రగిలిపోయిన రవీందర్ సింగ్, పార్టీకి రాజీనామా చేసి, ఈటల వైపు వచ్చేశారు. దీంతో రవీందర్‌ను గెలిపించుకోవడమే తన లక్ష్యమని ఈటల ప్రకటించారు. కానీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచేందుకు, తగినంత బలంలేదని లెక్కలేసిన బీజేపీ రాష్ట్ర నాయకత్వం, పోటీకి దూరమని ప్రకటించింది. కానీ రవీందర్‌ను గెలిపిస్తానని శపథం చేసిన ఈటల, రవీందర్‌ విషయంలో తనకు పూర్తిస్వేచ్చ కావాలని అడిగారట. స్వతంత్ర అభ్యర్థిగా రవీందర్‌ను బరిలోకి దించారు. ఈ పరిణామం రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు అస్సలు నచ్చలేదు. ఈటల తీరుపై ఒకింత అసహనం వ్యక్తం చేశారు. కానీ కేంద్ర నాయకత్వంతో మంచి రిలేషన్‌ వున్న ఈటల, ఎలాగైనా గెలిపించి తీరుతానని, మండలిలో బీజేపీకి ఎమ్మెల్సీ సభ్యుడిని గిఫ్టుగా ఇస్తానని హామి ఇచ్చారు. ఇక్కడే అసలు ఆట ప్రారంభమైంది.

నిజంగా ఈటల గెలిపించుకుంటే, బీజేపీలో ఈటలకు ఎనలేని పట్టు దొరికినట్టే. అదే టైంలో, బండి సంజయ్‌కు పట్టుజారినట్టేనని కొందరు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అదే, బీజేపీలో వాడివేడి చర్చను రాజేస్తోంది. మండల, జిల్లా పరిషత్‌లతో తనకు పట్టుందని భావిస్తున్న ఈటల, రవీందర్‌ సింగ్‌ను గెలిపించడానికి ఊరూవాడా తిరుగుతున్నారు. జడ్పీటీసీ, ఎంపిటీసీలతో మాట్లాడుతున్నారు. క్యాంప్‌ రాజకీయాలకు సైతం తెరలేపారు. అటు ఈటలను ఈ రకంగానైనా దెబ్బకొట్టాలని అధికార టీఆర్ఎస్ కూడా పావులు కదుపుతోంది. అధికార పార్టీ కంటే కూడా, కమలంలోనే రవీందర్‌ సింగ్ గెలుపు, ప్రకంపనలు రాజేసే అవకాశముందన్న డిస్కషన్ సాగుతోంది.

రవీందర్‌ సింగ్ ఓడిపోతే, బీజేపీ పోటీ చెయ్యలేదు కాబట్టి, ఓటమితో సంబంధం లేదని, నాయకత్వం చెప్పుకోవచ్చు. కానీ గెలిస్తే మాత్రం కమలానికి ఎనలేని లక్కే. ఈటల రాజేందర్‌ పట్టుదలతో గెలిపించినట్టవుతుంది. ఓడిపోవాల్సిన సీటు, అస్సలు పోటీ చెయ్యని సీటు, ఖాతాలో పడటం బీజేపీలో కొత్త చర్చకు దారి తీస్తుంది. ఈటల రాజేందర్‌ కసి, పట్టుదలపై కేంద్ర నాయకత్వానికి గురి కుదురుతుంది. ఏదైనా టాస్క్ అప్పగిస్తే, దాన్ని కచ్చితంగా నెరవేరుస్తారన్న అభిప్రాయం కలుగుతుంది. అది రాష్ట్ర బీజేపీ నాయకత్వానికి మింగుడుపడదు. అలా వచ్చి, ఇలా ఢిల్లీ లెవల్‌లో ఈటల హైలెట్ కావడం, ప్రస్తుతం సాగుతున్న లీడర్‌షిప్‌కు జీర్ణంకాదంటున్నారు కొందరు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఈటల వద్దన్నా, తన అనుచరుడిని పోటీకి దింపారు. అది నేతలకు నచ్చడం లేదు. ఇఫ్పుడు ఏకంగా గెలిస్తే, ఇక ఈటలకు పట్టపగ్గాలుండవని లీడర్లు రగిలిపోతున్నారట. మొత్తానికి ఎమ్మెల్సీ స్థానాల్లోకెల్లా సర్దార్‌ నిలబడిన సీటు మాత్రం, ఇలా హాటుహాటుగా మారింది. ఆయన ఫేటు మారి మండలి సీటుపై కూర్చుంటే, స్టేట్‌ బీజేపీలో నాటునాటు, వీరనాటు లెవల్లో, కోల్డ్‌వార్‌కు క్లాప్‌ పడినట్టే. చూడాలి, ఏమవుతుందో.

Tags:    

Similar News