MLC Elections 2021: నెలరోజుల క్యాంప్, రిసార్ట్ రాజకీయాలకు తెర

* కరీంనగర్‌లో 99.70 శాతం, నల్గొండలో 97.01 శాతం పోలింగ్ * మెదక్‌లో 99.22 శాతం ఖమ్మంలో 96.09 శాతం పోలింగ్

Update: 2021-12-11 03:00 GMT

నెలరోజుల క్యాంప్, రిసార్ట్ రాజకీయాలకు తెర

MLC Elections 2021: క్యాంపులు, రిసార్ట్ రాజకీయాలకు తెరపడింది. నెలరోజులుగా ఉత్కంఠగా సాగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. దాదాపు అన్ని చోట్లా 90 శాతానికిపైగా ఓటింగ్ నమోదైంది. చదురు ముదురు ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. కరీంనగర్ జిల్లాలో రెండు, ఆదిలాబాద్, నల్గొండ, మెదక్, ఖమ్మం జిల్లాలో ఒక్కో స్థానానికి గానూ మొత్తం 26 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. ఆయ జిల్లాల్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు మొత్తం 5వేల 326 మంది ఓటర్ల కోసం 37 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా స్థానిక సంస్థల్లో ఎక్స్ అఫీషియో సభ్యులుగా ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు.

ఆదిలాబాద్‌లో 91.78 శాతం పోలింగ్, నల్గొండలో 97.01 శాతం, మెదక్‌లో 99.22 శాతం పోలింగ్ నమోదైంది. ఖమ్మంలో 96.09 శాతం పోలింగ్ నమోదు కాగా.. ఉమ్మడి కరీంనగర్‌లో 99.69 శాతం పోలింగ్ శాతం నమోదైంది. పోలింగ్ ముగిసిన వెంటనే బ్యాలెట్ బాక్సులను స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించారు. డిసెంబర్ 14న ఓట్ల లెక్కింపు చేపట్టి అదే రోజు ఫలితాలు వెల్లడించనున్నారు. స్ట్రాంగ్ రూమ్ వద్ద సిసి కెమెరాల నిఘాతో పాటు, పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్‌కు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 14న ఉదయం 8 గంటలకు లెక్కింపు చేపడతారు. మొదటగా బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తారు. ఎన్నికల ఫలితాల అనంతరం గెలిచిన అభ్యర్థులు విజయోత్సవ ర్యాలీలు చేయకూడదని సీఈఓ శశాంక్ గోయల్ తెలిపారు.

లోకల్‌బాడీ కోటాలో మొత్తం 12 ఎమ్మెల్సీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చింది ఎన్నికల సంఘం. అయితే ఇందులో ఆరు స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవం అయ్యాయి. ఈ ఆరు చోట్ల అధికార టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులే గెలిచారు. మిగిలిన ఆరు స్థానాలకు పోలింగ్‌ జరిగింది. ఎన్నికలు జరిగిన ఐదు జిల్లాల్లోనూ గులాబీ దళానికే మెజార్టీ ఉందని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం, మెదక్‌ జిల్లాల్లో కాంగ్రెస్‌ పోటీలో ఉంది. కరీంనగర్‌లో టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన మాజీ మేయర్‌ రవీందర్‌సింగ్‌ పోటీ చేశారు. ముందు జాగ్రత్తగా ఓటర్లను క్యాంప్‌లకు తరలించిన అధికార పార్టీ.. ఓటర్లు చేజారకుండా జాగ్రత్తలు తీసుకుంది.

Tags:    

Similar News