Eatala Rajender: రెండు స్థానాల్లో ఈటలకు తప్పని పరాభవం
Eatala Rajender: గజ్వేల్‌లో కేసీఆర్ గాలికి నిలవలేకపోయిన ఈటల
Eatala Rajender: రెండు స్థానాల్లో ఈటలకు తప్పని పరాభవం
Eatala Rajender: బీజేపీ సీనియర్ నేత ఈటల రాజేందర్ పరిస్థితి రెంటికీ చెడ్డ రేవడిలా తయారైయింది. సొంత నియోజకవర్గం హుజూరాబాద్‌తో పాటు సీఎం కేసీఆర్‌తో తలపడేందుకు ఈటల గజ్వేల్‌కు కూడా వెళ్లారు. దీంతో ఈటల రాజేందర్ రెండు నియోజకవర్గాల్లో ఓటమిని చవిచూశారు. గజ్వేల్‌లో పోటీ కారణంగా హుజూరాబాద్‌పై ఈటల పూర్తిస్థాయిలో దృష్టి సారించలేకపోయారేమో అన్న అంచనాలు వెలువడుతున్నాయి.
హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి విజయం సాధించారు. ఇక్కడ ఈటల మూడో స్థానానికి పడిపోవడం బీజేపీని కలవరపెడుతోంది. గతంలో హుజూరాబాద్‌లో జరిగిన ఉప ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌పై ఈటల ఘన విజయం సాధించారు. దీంతో బీజేపీ అగ్రనేతల కూడా ఈటలను ప్రశంశించారు. ఈ సారి కూడా ఈటలకు విజయం తధ్యమని అంతా అనుకున్నారు. ఈటలకు హుజూరాబాద్ కంచుకోట అని ఇంత కాలం భావించారు. కాని అనూహ్యంగా ఈటల ఓటమి బీజేపీ వర్గాలను షాక్‌కు గురిచేసింది.
ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ గాలి వీస్తున్న పరిస్థితిలో బీఆర్ఎస్ అగ్రనేతలు సైతం ఓటమి బాటలో నడిచారు. ఈ నేపథ్యంలో హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ అభ్యర్థి కౌశిక్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్‌పై చేయి సాధించారు. సరిగ్గా ఎన్నికలకు ఒకట్రెండు రోజుల ముందు కౌశిక్‌రెడ్డి సంచలన కామెంట్స్ చేశారు. తనను గెలిపించకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందని కౌశిక్‌రెడ్డి సెంటిమెంట్ వ్యాఖ్యలు వర్కౌట్ అయ్యాయి. ఈ కామెంట్స్‌పై ఈసీ కేసు కూడా నమోదు చేసింది. ఈ నేపథ్యంలో కౌశిక్‌రెడ్డి విజయం సాధించడం, ఈటల మూడో స్థానానికి పడిపోవడం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
సొంత నియోజకవర్గాన్ని వదిలి పెట్టడం వల్లే ఈటలకు ఈ పరిస్థితి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గతం కంటే బీజేపీ చెప్పుకోతగ్గ స్థానాలను కైవసం చేసకుంటే హుజూరాబాద్‌లో ఓడిపోవడం హాట్ టాపిక్‌గా మారింది.