Dubbaka Mla: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అరెస్టు
Dubbaka Mla: మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరగా ఎమ్మెల్యేను అరెస్టు చేశారు
Mla Raghunandan Rao
Dubbaka Mla: దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. మల్లన్న సాగర్ ముంపు బాధితుడు మల్లారెడ్డి మరణం ప్రభుత్వ హత్యేనని విపక్షాలు తీవ్ర విమర్శలు చేశాయి. ఈ ఘటన గురించి తెలుసుకున్న బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు బయలుదేరారు. దీంతో పోలీసులు ఆయన్ను అడ్డగించి తుక్కాపూర్ వద్ద అరెస్ట్ చేశారు. అనంతరం రాయపోల్ మండలంలోని బేగంపేట పోలీస్ స్టేషన్‌కు రఘునందన్ రావును తరలించారు.
రైతు మల్లారెడ్డి ఆత్మహుతికి పాల్పడడం విచారకరమని రఘునందన్ రావు అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఘటనాస్థలికి వెళ్లి వారిని పరామర్శించేందుకు ప్రయత్నిస్తే తనను అరెస్ట్ చేయడం సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. మసిపూసి మారెడుకాయ చేసే పనిలో అధికారులు ఉన్నారని.. సభ్యసమాజం తల దించుకునే విధంగా కేసీఆర్ పాలన ఉందని రఘునందన్‌రావు విమర్శలు చేశారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు విషయంలో మాట్లాడితే ఎందుకు అరెస్టులు చేస్తున్నారో అర్థం కావట్లేదని రఘునందన్ మండిపడ్డారు.