JNTU Kukatpally: డ్రైనేజీ నీటితో అద్వానంగా మారిన జేఎన్టీయూ వసతి గృహాల పరిసరాలు

కూకట్‌పల్లి జేఎన్టీయూలో కొన్నేళ్లుగా డ్రైనేజీ, మురుగు నీటి సమస్యలు డ్రైనేజీ పైప్ లేన్‌ల పనులు ప్రారంభించి రోజుల గడుస్తున్నప్పటి.. పూర్తి చేయకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న విద్యార్థులు

Update: 2026-01-06 07:00 GMT

JNTU Kukatpally: డ్రైనేజీ నీటితో అద్వానంగా మారిన జేఎన్టీయూ వసతి గృహాల పరిసరాలు

వందల మంది విద్యార్థులు ఉండే జేఎన్టీయూ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో డ్రైనేజీ, మురుగు నీటి సమస్యలు తిష్ట వేసుకొని కూర్చున్నాయి. డ్రైనేజీ పైప్ లైన్‌ల పనులు ప్రారంభించి రోజులు గడుస్తున్నప్పటికీ.. ఇంతవరకు పూర్తి చేయకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాల్సిన విద్యార్థులు దోమలు, దుర్వాసనతో సావాసం చేస్తున్నారు. రోజు రోజుకి ఈ సమస్య పెరిగిపోతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

కూకట్‌పల్లి జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో సంవత్సరాలు గడుస్తున్నా డ్రైనేజీ సమస్యకు పరిష్కారం లభించడంలేదని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. జేఎన్‌టీయూ యూనివర్సిటీలోని వసతి గృహాల వద్ద డ్రైనేజీ పైప్‌లైన్ పనులు గతంలో ప్రారంభించినప్పటికీ, అవి నత్తనడకన సాగుతున్నాయని విద్యార్థులు చెబుతున్నారు. వసతి గృహాల పరిసరాల్లో డ్రైనేజీ నీరు రోడ్లపై పారుతూ తీవ్ర దుర్వాసన వెదజల్లుతోందని, ఆ మార్గంలో వెళ్లలేని పరిస్థితి నెలకొందని విద్యార్థులు వాపోతున్నారు.


డ్రైనేజీ నీరు రోడ్లపై నిలిచిపోవడంతో ఆ మురుగు నీటి పైన నాచు ఏర్పడి, దోమలు విపరీతంగా పెరుగుతున్నాయని, దాని కారణంగా వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులు అనారోగ్యానికి గురవుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇక రాత్రి సమయాల్లో దోమలు, డ్రైనేజీ దుర్వాసన వల్ల ప్రశాంతంగా పడుకోలేకపోతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిష్కారం కోసం అధికారులను సంప్రదిస్తే, గతంలో జేఎన్‌టీయూ నుంచి జీహెచ్ఎంసీకి నిధులు కేటాయించి ఇచ్చామని చెబుతున్నారు కానీ పరిష్కారం చూపించడం లేదని తెలిపారు.

 నిధులు ఇచ్చినప్పటికీ, జీహెచ్ఎంసీతో సమన్వయం చేసుకొని పనులు ఎందుకు పూర్తి చేయడం లేదని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వందల మంది విద్యార్థులు ఉన్న యూనివర్సిటీలో పరిసరాలు ఇలా మురుగు నీటితో అద్వానంగా ఉన్న పట్టించుకోవడంలేదని.. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి డ్రైనేజీ పనులను త్వరగా పూర్తి చేసి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని విద్యార్థులు కోరుతున్నారు. సమస్యకు పరిష్కారం లేకపోతే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.

Tags:    

Similar News