హన్మకొండ కాకాజీకాలనీలో లింగ నిర్ధారణ పరీక్షలు.. స్కానింగ్ సెంటర్‌ను సీజ్ చేసిన వైద్యాధికారులు

పక్కా సమాచారంతో దాడులు నిర్వహించిన వైద్యాధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ డాక్టర్ సబిత, స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు ప్రవీణ్

Update: 2021-09-14 06:15 GMT

హన్మకొండ కాకాజీకాలనీలో లింగ నిర్ధారణ పరీక్షలు 

Hanamkonda: హనుమకొండలో లింగనిర్ధారణ పరీక్షలు చేస్తూ స్కానింగ్ సెంటర్ నిర్వాహకుడు, డాక్టర్ అడ్డంగా దొరికిపోయారు. కాకాజీకాలనీలోని నిత్య క్లినిక్‌ యజమాని ఇంట్లో జరుగుతున్న బాగోతంపై పక్కా సమాచారంతో జిల్లా వైద్యశాఖ, పోలీసులు, రెవెన్యూ అధికారులు దాడిచేశారు. దాడులు జరిగిన సమయంలో పదిమంది గర్భిణులను గుర్తించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే స్కానింగ్‌ సెంటర్‌తో పాటు అబార్షన్లను ప్రోత్సహించే కొన్ని ఔషధాలను కూడా స్వాధీనం చేసుకున్నారు. పదిమంది గర్భిణుల్లో ఆరుగురు మహారాష్ట్రకు చెందిన వారు కాగా, నలుగురు స్థానికులుగా గుర్తించారు అధికారులు. అనంతరం వారిని వైద్య పరీక్షల నిమిత్తం హనుమకొండ ప్రసూతి ఆస్పత్రికి తరలించారు.

నిత్య క్లినిక్‌ యజమాని ప్రవీణ్‌, సబితతో పాటు కొందరు సిబ్బందిపై కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనంతరం అధికారులు ప్రవీణ్‌ నివాసాన్ని సీజ్‌ చేశారు. కాగా, అక్రమంగా అబార్షన్లు చేస్తున్న ఆనందపు సబిత, రేగుల ప్రవీణ్‌కుమార్‌ను అరెస్టు చేసినట్టు హనుమకొండ సీఐ వేణుమాధవ్‌ తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా కేసముద్రం మండలం ఇనుగుర్తి గ్రామానికి చెందిన సబిత, చిల్పూర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌ గతంలో నగరంలోని ఓ క్లినిక్‌లో పని చేశారని, ఆ సమయంలో స్కానింగ్‌, అబార్షన్లు చేయడం నేర్చుకున్నారని తెలిపారు.

తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే అత్యాశతో హన్మకొండ కాకాజీ కాలనీలో ఓ గదిని అద్దెకు తీసుకున్నారని, అనుమతులు లేకుండా స్కానింగ్‌లు, అబార్షన్లు చేయడం మొదలుపెట్టారని వివరించారు. దీనిపై కొందరు డాక్టర్లు డీఎంహెచ్‌వోకు ఫిర్యాదు చేయగా జిల్లా వైద్యాధికారి లలితాదేవి పర్యవేక్షణలో దాడులు నిర్వహించి సబిత, ప్రవీణ్‌కుమార్‌లను అరెస్టు చేశామని చెప్పారు.

Tags:    

Similar News