టీకాంగ్రెస్‌లో అసమ్మతి కుంపటి.. జంబో కమిటీల ప్రకటనపై సీనియర్ల అసంతృప్తి

* భట్టి నివాసంలో నేతల వరుస భేటీలు.. నేటి పీసీసీ సమావేశానికి దూరంగా సీనియర్లు!

Update: 2022-12-18 00:49 GMT

టీకాంగ్రెస్‌లో అసమ్మతి కుంపటి.. జంబో కమిటీల ప్రకటనపై సీనియర్ల అసంతృప్తి

Congress: తెలంగాణ కాంగ్రెస్‌లో అసమ్మతి కుంపటి రాజుకుంది. అసలైన కాంగ్రెస్, వలస కాంగ్రెస్ అంటూ నేతలు రెండు వర్గాలు విడిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇటీవల పీసీసీ జంబో కమిటీల ప్రకటన అసంతృప్తికి అగ్గి రాజేసింది. కొంతకాలంగా కాంగ్రెస్ నేతల్లో ఉన్న అసమ్మతి క్రమంగా మరింత పెరుగుతోంది. కమిటీల ఏర్పాటులో జరిగిన అన్యాయంపై అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు రెడీ అవుతున్నారు.

ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మాణికం ఠాగూర్, పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు వేసిన జంబో కమిటీలు పార్టీలో చిచ్చు రేపాయి. కొద్ది రోజుల క్రితం సీఎల్పీ నేత భట్టి ఇంట్లో హనుమంతరావు, గీతారెడ్డి, కోదండరెడ్డి, ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ప్రేమ్ సాగర్‌ రావులు భేటీ అయి కమిటీల్లో జరిగిన అన్యాయంపై చర్చించారు. కమిటీల కూర్పులో తనకు భాగస్వామ్యం కల్పించలేదని భట్టి ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం భట్టి నివాసంలో ఎమ్మెల్యే శ్రీధర్ బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డిలు భేటీ అయి కమిటీ ఏర్పాటుపై చర్చించారు. శనివారం భట్టి ఇంట్లో సీనియర్ నాయకులు సమావేశమై దాదాపు మూడు గంటల పాటు కమిటీల కూర్పు, పీసీసీ డెలిగేట్ల ఎంపిక, ఇతర అంశాలపై చర్చించారు.

పార్టీలోని కొందరిపై కోవర్ట్ ముద్ర వేస్తున్నారని... సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పోస్టులు పెడుతున్నారని కొందరు నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. పార్టీలో జరుగుతున్న తాజా పరిస్థితులు, కమిటీల కూర్పు, తదితర అంశాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సేవ్ కాంగ్రెస్ నినాదంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించినట్లు నేతలు వెల్లడించారు. వసలవాదుల కారణంగా అసలైన కాంగ్రెస్ నాయకులకు తీవ్ర నష్టం జరుగుతోందంటున్నారు. త్వరలోనే అధిష్టానాన్ని కలిసి ఇక్కడి పరిస్థితులు తెలియజేస్తామంటున్నారు. నేడు జరిగే పీసీసీ కార్యవర్గ సమావేశానికి హాజరుకాకూడదని అసంతృప్తులు భావిస్తున్నారు. 

Tags:    

Similar News