Coronavirus Vaccine: వ్యాక్సిన్‌ తయారీకి మరో 8 నెలలు: సీసీఎంబీ

Update: 2020-06-11 09:08 GMT
Representational Image

కంటిని కనిపించని కరోనా వైరస్ చాపకింద నీరులా విస్తరిస్తూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న విషయం తెలిసిందే. ఈ వైరస్ బారిన పడి ఎంతో మంది అనారోగ్యం పాలయి తమ ప్రాణాలను కోల్పోతున్నారు. దీంతో ప్రపంచ దేశాలన్నీ వైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన్ ని తయారు చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ దోవలోనే సెంటర్‌ ఫర్‌ సెల్యులార్‌ అండ్‌ మాలిక్యులర్‌ బయాలజీ (సీసీఎంబీ) కృషి చేస్తోంది. అయితే దాని ఫలితాలు వచ్చేందుకు మరో 6 నెలల నుంచి 8 నెలల సమయం పట్టే అవకాశముందని డాక్టర్‌ సోమ్‌దత్తా కరక్‌ తెలిపారు. ఈ వ్యాక్సిన్ ని తయారు చేయడానికి వేర్వేరు ప్రాంతాల్లోని కరోనా రోగుల నుంచి తాము ఇప్పటికే వైరస్‌ నమూనాలు సేకరించి వాటిని పరిశోధన శాలలోనే వృద్ధి చేస్తున్నామని ఆమె తెలిపారు.

సీసీఎంబీ ఈ వ్యాక్సిన్ తయారీ కోసం కొన్ని నెలల క్రితమే ప్రయత్నాలు మొదలుపెట్టిందని గుర్తు చేశారు. వైరస్‌ను పరిశోధనశాలలో వృద్ధి చేయడం అంత ఆషామాషీ వ్యవహారమేమీ కాదని ఇందుకోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు, పద్ధతులు అవసరమని చెప్పారు. వీలైనంత ఎక్కువ పరీక్షలు నిర్వహించడం ద్వారా టీకా సమర్థతను, పనితీరును మదింపు చేయకపోతే సమస్య మరింత జటిలమవుతుందన్నారు. టీకా అభివృద్ధిలో పలు దశలుంటాయని ఆమె తెలిపారు. ఆ కారణంగానే టీకాను అభివృద్ధి చేయడానికి కాస్త ఎక్కువ సమయం పడుతోందని వెల్లడించారు. ఈ వ్యాక్సిన్ ని కనుగొనడానికి ఇప్పటికే సీసీఎంబీ, విన్స్‌ బయోటెక్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకుందని, మరిన్ని కంపెనీలు సీసీఎంబీతో కలసి పనిచేసేందుకు ఆసక్తి చూపాయని తెలిపారు. ఈ వ్యాక్సిన్ కనుక విజయవంతంగా తయారయితే లక్షల మంది ప్రాణాలను కాపాడొచ్చిని తెలిపారు.


Tags:    

Similar News