Coronavirus: కరోనా విజృంభిస్తున్నా డోన్ట్‌ కేర్‌ అంటున్న జనాలు

Coronavirus: మాస్క్‌ లేకుండానే తిరుగుతున్న ప్రజలు * కరీంనగర్‌ జిల్లాలో తగ్గిన మాస్కుల వాడకం

Update: 2021-03-29 07:10 GMT

కరోనా వైరస్ (ఫైల్ ఫోటో)

Coronavirus: చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అంటే ఇదే మరీ.. మాస్కులు పెట్టుకోండని వైద్యులు, అధికారులు నెత్తినోరు బాదుకున్నా పట్టించుకునే నాధుడే లేడు. నిర్లక్ష్యానికి చెల్లించదు భారీ మూల్యం అని ఎన్ని ప్రకటనలు చేసినా ప్రజల తీరు మారడం లేదు. మాస్క్‌ లేకుండానే దర్జాగా తిరుగుతున్నారు. మాస్క్‌ వాడకాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసినా అదే ఫలితం. కరీంనగర్‌ జిల్లా ప్రజలైతే మాస్క్‌ అనే మాటనే మరిచిపోయారు.

ఓ పక్కా కరోనా సెకండ్‌ వేవ్‌ పడగ విప్పి బుసలు కొడుతుంది. ఐనా డోన్ట్‌ కేర్‌ అంటున్నారు జనాలు. ఒక్కరూ కూడా మాస్క్‌ పెట్టుకోవడం లేదు. కరోనా గిరోనా జన్తా నహీ అంటూ బిల్డప్‌ ఇస్తున్నారు. కొందరైతే పేరుకు మాస్క్‌ పెట్టుకున్నా స్టైల్‌గా గడ్డం కిందకు లాగేస్తున్నారు. ఆ మాత్రం పెట్టుకోవడం దేనికో వాళ్లకు కూడా తెలియదు కాబోలు.

మంచిగా చెబితే ఎవ్వరూ వినరు. అదే ఫైన్‌ అంటే కొంతలో కొంతైనా దారిలోకి వస్తారు. కరోనా నిబంధనల్లో అచ్చం అదే ఫాలో అవుతోంది ఏపీ ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం కూడా మాస్క్‌లు ధరించాలని ఎప్పటి నుంచో చెబుతోంది. మనం ఎవరికైనా ఫోన్‌ చేసినా ప్రతిసారి ఇదే విషయాన్ని గుర్తుకు చేస్తుంది. ఐనా ప్రజల్లో అదే నిర్లక్ష‌్యం కనిపిస్తుంది. మాస్క్‌ పెట్టిన మనిషే కనిపించడం లేదు.

కరీంనగర్‌ జిల్లాలో మొదటి దశలో కరోనా కేసులు విజృంభించాయి. ఇప్పుడు సెకండ్‌ వేవ్‌ మొదలైంది. ఇప్పటికైనా జాగ్రత్తలు పాటించాలంటూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మాస్క్‌ తప్పనిసరి చేశారు. కానీ అందరూ లైట్‌ లైట్‌ తీసుకుంటున్నారు. పోలీసులు, అధికారులు కూడా ఇంప్లిమెంటేషన్ లో ఆసక్తి చూపించడం లేదు. దీంతో జిల్లాలో చాలా మంది మాస్క్‌ ధరించకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నారు. కరోనాను కట్టడి చేయాలంటే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా మాస్క్‌లు ధరించాల్సిందే లేదంటే కరోనాకు గురికాక తప్పదు. ఇప్పటికైనా మాస్క్‌ మస్ట్‌గా వాడతారని ఆశిద్దాం. 

Tags:    

Similar News