Telangana: రాహుల్ గాంధీ రాకకోసం ముస్తాబవుతోన్న ఓరుగల్లు

Telangana: ఈనెల 6న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో సభ

Update: 2022-05-05 03:00 GMT

రాహుల్ గాంధీ రాకకోసం ముస్తాబవుతోన్న ఓరుగల్లు

Telangana: రాహుల్ గాంధీ రాకకోసం ఓరుగల్లు ముస్తాబవుతోంది. శతాధిక వసంతాల పార్టీ తెలంగాణలో పునర్వైభవం సంతరించుకునేందుకు వేదికగా ఉద్యమాల గడ్డ ఓరుగల్లును ఎంచుకుంది. వరంగల్ సెంటిమెంట్ తో ఈనెల 6న హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల మైదానంలో రాహుల్ గాంధీ సభను సక్సెస్ చేసేందుకు పార్టీ నేతలు విభేదాలన్నీ పక్కనపెట్టి పోటాపోటీగా జనసమీకరణపై దృష్టి పెట్టారు. ఇప్పటికే వరంగల్, హన్మకొండ ప్రాంతాలు జాతీయ, రాష్ట్ర స్థాయి నాయకుల రాకతో సందడిగా మారింది.

రాహుల్ గాంధీ టూర్ ను సక్సెస్ చేస్తూ మరోసారి వరంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను ఎగురవేయాలని తహతహలాడుతున్న నేతలంతా ఈ సభను ఓన్ చేసుకుంటున్నారు. దీంతో వివిధ నియోజకవర్గాల నుంచి టికెట్లు ఆశిస్తు్న్న నేతలు పోటా పోటీగా, ఎవరికివారే జనసమీకరణకు ప్రయత్నిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం జరిగిన డిజిటల్ సభ్యత్వ నమోదును ఏ మాత్రం పట్టించుకోని నియోజకవర్గంలోని నేతలు సైతం ఇప్పుడు ఉదయం ఏడుగంటలకే ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.

ఇదంతా సభ నేపథ్యంలో జరిగే సన్నాహక సందడి అనుకుంటున్నప్పటికీ నేతల ఉనికికి సంబంధించిన ఆరాటం మాత్రం స్పష్టంగా కనిపిస్తోంది. నెక్ట్స్ టికెట్ నాకంటే నాకేనంటూ అనుచరులు, కార్యకర్తల వద్ద చెప్పుకుంటున్నారు. వరంగల్, హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు నాయని రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో సభా ఏర్పాట్లు జరుగుతున్నాయి. సభాప్రాంగణం మొత్తం 24 ఎకరాలు కాగా సభలో మూడు వేదికలు ఏర్పాటుచేశారు. ఇందులో ఒకటి రాహుల్ కూర్చునే ప్రధాన వేదిక, మరొకటి తెలంగాణ అమరవీరుల కుటుంబసభ్యులు, ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలు కూర్చునేందుకు వీలుగా ఏర్పాటు చేస్తున్నారు. ఇంకొక వేదికపై కళాకారుల ఆటపాటకోసం రూపొందించారు. చెబుతున్నారు.

తెలంగాణలోని కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు ఉన్న అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల నుంచి పెద్ద ఎత్తున జనాన్ని సమీకరించడంతో పాటు గతంలో కాంగ్రెస్ కంచుకోటల్లా ఉన్నచోట్ల నుంచి భారీగా జనాన్ని తరలించనున్నట్లు సమాచారం. వీరందరినీ సభ జరిగే 6వ తేదీన ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు వరంగల్ కు చేరేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. సభకు లక్షలాదిగా జనాన్ని తరలించి తమ బలమేంటో చూపించడానికి పార్టీ ఉవ్విళ్లూరుతోంది. జనసమీకరణకు ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో సన్నాహక సమావేశాలు జరుగుతున్నాయి. పార్టీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలతో వివిధ కమిటీలను ఏర్పాటు చేసి నిత్యం సభా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. సభకు జనసమీకరణ విషయంలో కాంప్రమైజ్ అయ్యేదే లేదని, నభూతో నభవిష్యత్ అన్న రీతిలో సభకు జనసమీకరణ చేస్తున్నామని కాంగ్రెస్ అధికారప్రతినిధి రవళి చెప్పారు.

Full View


Tags:    

Similar News