Revanth Reddy: గ్రేటర్‌లో ట్రాఫిక్ నియంత్రణపై సీఎం రేవంత్ సమీక్ష
Revanth Reddy: జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాల సమన్వయంతో ప్రణాళికలు
Revanth Reddy: గ్రేటర్‌లో ట్రాఫిక్ నియంత్రణపై సీఎం రేవంత్ సమీక్ష
Revanth Reddy: గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక సిద్ధం చేస్తోంది ప్రభుత్వం. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్‌లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ప్లాన్స్ సిద్ధం చేయాలని భావిస్తోంది.. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోనుంది. జీహెచ్ఎంసీ, పోలీసు విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
హైదరాబాద్ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా గ్రేటర్ సిటీలో ట్రాఫిక్ నియంత్రణ, నిర్వహణపై సమగ్ర ప్రణాళికను రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. అందులో నిపుణులైన కన్సల్టెన్సీలకు బాధ్యతలు అప్పగించి ప్రత్యేకంగా అధ్యయనం చేయించాలన్నారు. పెరిగిన వాహనాల సంఖ్యకు అనుగుణంగా ట్రాఫిక్ సిబ్బంది అందుబాటులో లేరని సమావేశంలో చర్చించారు. వెంటనే తగినంత మంది హోంగార్డుల నియామకాలు చేపట్టాలని ఆదేశించింది ప్రభుత్వం. మూడు నెలల్లోగా ఈ నియామకాలు జరిగేలా ఏర్పాట్లు చేస్తుంది. కొత్తగా నియమించిన వారికి తగిన శిక్షణఇవ్వనుంది. ఈలోపు వివిధ విభాగాల్లో పని చేస్తున్న హోం గార్డులను ట్రాఫిక్ విభాగానికి తిరిగి రప్పించి. తక్షణమే వారి సేవలను వినియోగించు కోనుంది..
ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండే సమయాల్లో లా అండ్ ఆర్డర్ పోలీసులను గ్రేటర్ సిటీ ట్రాఫిక్ కంట్రోల్ విధులకు వినియోగించుకోవాలని ముఖ్యమంత్రి సూచించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పరిధిలో ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ల స్థాయిని అప్ గ్రేడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. వాటికి సరిపడే సంఖ్యలో సిబ్బంది నియామకాలు చేపడుతామని సీఎం తెలిపారు.సిటీలోని అన్ని ప్రధాన జంక్షన్లు, రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రాఫిక్ సిబ్బంది తప్పకుండా అక్కడ ఉండేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. కేవలం ఆటోమేటిక్ సిగ్నల్ వ్యవస్థ మీద ఆధారపడకూడదని,ద్విచక్ర వాహనాలపై ఎస్ఐలు, కానిస్టేబుళ్లను పంపించి ట్రాఫిక్ జామ్ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
పెరుగుతున్న వాహనాల రద్దీకి అనుగుణంగా ప్రధాన రహదారులు, జంక్షన్ల విస్తరణపై దృష్టి పెట్టింది ప్రభుత్వం.. ఎల్బీ నగర్ జంక్షన్ తరహాలో సబ్ వే, అండర్ పాస్, సర్ఫేస్ వే లను ఎక్కడెక్కడ నిర్మించాలనేదానిపై చర్చించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ల పోలీస్ అధికారులు, మున్సిపల్ జోనల్ కమిషనర్లు సమన్వయంతో ట్రాఫిక్ నియంత్రణపై దృష్టి పెట్టాలని అన్నారు. ప్రతినెలా తప్పనిసరిగా సమావేశమై ట్రాఫిక్ ఇబ్బందులను సమీక్షించి, తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు ముఖ్యమంత్రి.
వీలైనన్ని చోట్ల మల్టీ లెవల్ కార్ పార్కింగ్ సెంటర్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలని నిర్ణయం తీసుకున్నారు. ప్రైవేటు, ప్రభుత్వ స్థలాలు గుర్తించాలని, పార్కింగ్ సెంటర్ల ఏర్పాటుకు ముందుకొచ్చే వారికి ప్రభుత్వ పరంగా రాయితీలు ఇవ్వాలని సీఎం తెలిపారు. అన్ని విధివిధానాలతో ప్రత్యేక పార్కింగ్ పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు.లే అవుట్లకు హెచ్ఎండిఏ అనుమతులు ఇచ్చేటప్పుడు అక్కడ రోడ్లు, పార్కులు, మౌలిక వసతులకు ఎంత స్థలం కేటాయించాలనే ప్రమాణాలు పున: పరిశీలించాలని సీఎం ఆదేశించారు. విశాలమైన రోడ్లు ఉండేలా దేశంలోని ఇతర నగరాలు, విదేశాల్లో ఎలాంటి పద్దతులను అనుసరిస్తున్నారో పరిశీలించాలని సీఎం సూచించారు. హైదరాబాద్ లో బహుళ అంతస్తుల భవనాలకు అనుమతులు ఇచ్చేటప్పుడు ఆ ఏరియాలో ఉండే ట్రాఫిక్ ను దృష్టిలో పెట్టుకోవాలని సీఎం ఆదేశించారు.