Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి సీఎం శంకుస్థాపన

Osmania Hospital: హైదరాబాద్ లోని గోషామహల్ స్టేడియంలో ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు.

Update: 2025-01-31 07:13 GMT

Osmania Hospital: ఉస్మానియా ఆస్పత్రి నూతన భవనానికి సీఎం శంకుస్థాపన

Osmania Hospital: హైదరాబాద్‌లోని గోషా మహల్ లో కొత్త ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణానికి తెలంగాణ సీఎం ఎ. రేవంత్ రెడ్డి శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ. 2700 కోట్లతో ఈ పనులు చేపట్టనున్నారు. అంతర్జాతీయ వైద్య సౌకర్యాలు ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి తీసుకురానుంది ప్రభుత్వం. 26 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ భవనం రెండేళ్లలో పూర్తి చేయాలని రేవంత్ సర్కార్ లక్ష్యంగా నిర్ధేశించుకుంది.

అత్యాధునిక సౌకర్యాలతో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవనం

ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణాన్ని 8 బ్లాకుల్లో 14 అంతస్తల్లో నిర్మిస్తారు. 32 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త భవనం నిర్మించనున్నారు. ఈ భవనంలో 2 వేల బెడ్స్ రోగులకు అందుబాటులోకి రానున్నాయి. 30 విభాగాల్లో రోగులకు వైద్య సేవలు అందించేలా భవనాన్ని డిజైన్ చేశారు.

ప్రతి డిపార్ట్ మెంట్ కు ఒక ఆపరేషన్ థియేటర్ అందుబాటులో ఉంటుంది. ఈ బిల్డింగ్ లో 29 మేజర్, 12 మైనర్ ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. రోబోటిక్ సర్జరీలు కూడా అందుబాటులోకి తీసుకురానున్నారు. దీనికితోడు ట్రాన్స్ ప్లాంటేషన్ థియేటర్స్ కూడా ఈ ఆసుపత్రిలో అందుబాటులోకి రానుంది.

అత్యాధునిక లాండ్రీ, ఎస్ టీ పీ, ఈ టీ పీ, బయో మెడికల్ వేస్ట్ మేనేజ్ మెంట్ సిస్టం ఏర్పాటు చేస్తారు. 500 బెడ్లతో ఇంటెన్సివ్ కేర్ యూనిట్ కూడా ఏర్పాటు కానుంది. ప్రతి రోజూ 5 వేల మంది ఓపీ రోగులకు పరీక్షలు నిర్వహించేలా ప్లాన్ చేశారు.గ్రౌండ్ ఫ్లోర్ లో అన్ని రకాల డయాగ్నోసిస్ సేవలకు సంబంధించి ల్యాబ్ లు ఏర్పాటు చేస్తారు. ఈ ఆసుపత్రి ఆవరణలోనే స్టాఫ్, మెడికల్ స్టూడెంట్స్ కోసం ప్రత్యేకంగా భవనాలు నిర్మిస్తారు. 

ఉస్మానియా ఆసుపత్రి చరిత్ర ఇదీ

చివరి నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఉస్మానియా ఆసుపత్రిని 1919లో కట్టించారు. 22 విభాగాలు, 1096 బెడ్స్ అందుబాటులో ఉన్నాయి. ట్రాన్స్ జెండర్ క్లినిక్, బ్లడ్ బ్యాంక్, స్కిన్ బ్యాంక్, డయాబెటిస్ క్లినిక్ వంటి చికిత్సలకు ఈ ఆసుపత్రి పేరొందింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ఆసుపత్రి టాప్. వీఐపీ, వీవీఐపీలు కూడా ఇదే ఆసుపత్రిలో చికిత్స తీసుకునేవారు. ప్రభుత్వాలు ఉస్మానియా ఆసుపత్రిపై శ్రద్ద చూపకపోవడంతో ఈ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరింది.

కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం జరిగింది?

ఉస్మానియా ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరింది.  ఈ ఆసుపత్రి భవనాన్ని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 2015 జులై 23న ఉస్మానియా ఆసుపత్రిని సందర్శించారు. శిథిలావస్థకు చేరిన ఉస్మానియా భవనాన్ని కూల్చి అదే ప్రదేశంలో మరో భవనాన్ని నిర్మిస్తామని ఆయన ప్రకటించారు.

అయితే ఈ ఆసుపత్రి భవనం హెరిటేజ్ బిల్దింగ్ అని కూల్చివేయవద్దని కొందరు తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరో వైపు ఈ భవనం శిథిలావస్థకు చేరిందని, దాని స్థానంలో కొత్త భవనం నిర్మించాలని మరికొందరు కోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఉస్మానియా ఆసుపత్రి భవన నిర్మాణంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీతో పాటు, హైకోర్టు కూడా మరో కమిటీని ఏర్పాటు చేసింది. ఈ రెండు కమిటీలు నివేదికలు అందించాయి.

ఉస్మానియా ఆసుపత్రి భవనం మరమ్మత్తులు చేస్తే మరికొంత కాలం ఉపయోగించుకోవచ్చని ఈ కమిటీ నివేదిక తెలిపింది. అయితే ఆసుపత్రి కోసం ఇది ఉపయోగపడదని కూడా స్పష్టం చేసింది. 2020 జులై లో కురిసిన వర్షానికి ఉస్మానియా ఆసుపత్రి భవనంలోకి వర్షం నీరు చేరింది. దీంతో ఇక్కడ ఉన్న రోగులను పక్కనే ఉన్న కొత్త భవనంలోకి మార్చారు. ఈ భవనం ఎప్పుడు కూలిపోతోందోననే భయంతో వైద్య సిబ్బంది ఆందోళన చేశారు. ఈ భవనంలోని అన్ని శాఖలను పక్కనే ఉన్న మరో భవనంలోకి మార్చాలని అప్పటి డీఎంఈ రమేశ్ రెడ్డి ఆదేశించారు.

దీంతో 2020 జులై 27న ఈ పాత భవనానికి తాళం వేశారు. ఈ విషయాన్ని అప్పట్లో కోర్టుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. కొత్త భవనం నిర్మించేందుకు కేసీఆర్ సర్కార్ అప్పట్లో ప్రణాళికలు సిద్దం చేసింది. కానీ, ఈ ప్రణాళిక అనేక కారణాలతో ముందుకు సాగలేదు.

ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని చారిత్రక సంపదగా కాపాడుతామని కాంగ్రెస్ పార్టీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించింది. గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి కొత్త భవన నిర్మాణం చేస్తామని 2024 ఆగస్టులో రేవంత్ రెడ్డి ప్రకటించారు. 

గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణంపై స్థానికుల వ్యతిరేకత

గోషామహల్ లో ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. ఉస్మానియా ఆసుపత్రిని ఇక్కడ నిర్మిస్తే తమకు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై తమకు ఉన్న సందేహలను తీర్చిన తర్వాతే నిర్మించాలని కోరుతున్నారు. ఉస్మానియా ఆసుపత్రి నిర్మాణ పనులకు రేవంత్ రెడ్డి శంకుస్థాపనకు రావడాన్ని నిరసిస్తూ స్థానికులు బంద్ కు పిలుపునిచ్చారు. అయితే నిరసనకారులను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

Full View


Tags:    

Similar News