CM KCR: హుజూరాబాద్‌లో వ్యా్క్సినేషన్‌పై సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ

CM KCR: ఉప ఎన్నికలోపు టీకాలు పూర్తి చేయాలన్న కేసీఆర్!

Update: 2021-06-26 03:57 GMT

సీఎం కెసిఆర్ (ఫైల్ ఇమేజ్)

CM KCR: హుజురాబాద్‌లో గులాబీ జెండా ఎగరవేయడమే లక్ష్యంగా అడుగులు వేస్తోన్న కేసీఆర్‌.. రాజకీయ వ్యూహాలతో పాటు ప్రజా సమస్యలపైనా దృష్టి పెట్టారు. ఉపఎన్నికలో ఏ అంశం మైనస్‌ కాకుండా ఉండేందుకు పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఓ వైపు నియోజకవర్గ వ్యాప్తంగా ఇంఛార్జ్‌లతో రాజకీయ సమాచారం సేకరిస్తున్న గులాబీ బాస్‌.. నియోజకవర్గంలో ప్రతీ ఒక్కరికీ టీకా అందేలా చర్యలు తీసుకోవాలని నేతలకు సూచిస్తున్నారట. దీంతో టీకా కార్యక్రమాన్ని కూడా కేసీఆర్‌ తన వ్యూహంలో భాగస్వామ్యం చేస్తున్నారనే టాక్‌ వినిపిస్తోంది.

హుజూరాబాద్‌ను ఎలాగైనా సొంతం చేసుకోవాలని భావిస్తోన్న గులాబీ బాస్‌.. ఇప్పుడు టీకాలపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ లో ఉప ఎన్నిక జరిగే అవకాశం కనిపిస్తుండటంతో ఆలోపే వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం నేతలకు సూచించినట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఉచిత టీకా పంపిణీ జరుగుతుండగా.. హుజురాబాద్‌ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి వీలైనంత త్వరగా వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలని ఆరోగ్య శాఖ అధికారులకు సూచనలు కూడా వెళ్లాయని తెలుస్తోంది.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక సమయంలో చాలామంది పార్టీ నేతలు, కార్యకర్తలకు కరోనా సోకింది. దీన్ని దృష్టిలో ఉంచుకుని హుజురాబాద్ నియోజకవర్గంలో వ్యాక్సినేషన్‌ పూర్తి చేయాలనేది సీఎం ఆలోచనగా తెలుస్తోంది. ఇక్కడ దాదాపు రెండు లక్షలకు పైగా ఓటర్లు ఉండగా.. మండలాల వారీగా వివరాలు సేకరించి త్వరితగతిన టీకాలు ఇవ్వాలని భావిస్తున్నారని సమాచారం. ఇప్పటివరకు పదిహేను వేల మందికి మాత్రమే వ్యాక్సిన్ ఇచ్చారు. మిగిలిన 90% జనాభాకు త్వరగా వ్యాక్సిన్ పంపిణీ జరిగేలా ప్లాన్ జరుగుతుండగా.. నియోజకవర్గ పరిధిలో భారీ బహిరంగ సభకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారట అక్కడి నేతలు. ఈ సభకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరయ్యే అవకాశం ఉండటంతో.. నియోజకవర్గంలో పూర్తి స్థాయిలో టీకా పంపిణీ జరిగేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట అధికారులు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా టీకా పంపిణీ కార్యక్రమం జరుగుతున్నా.. ప్రభుత్వం ఒక్క హుజురాబాద్ నియోజకవర్గంపైనే దృష్టి సారించడం ఎన్నికల వ్యూహంలో భాగమే అంటున్నారు విశ్లేషకులు. 

Full View


Tags:    

Similar News