సీఎం కేసీఆర్ కొత్త ప్లాన్.. ఐఏఎస్, ఐపీఎస్‌లకు కీలక శాఖల బాధ్యత

CM KCR: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారా ?

Update: 2023-01-17 15:30 GMT

సీఎం కేసీఆర్ కొత్త ప్లాన్.. ఐఏఎస్, ఐపీఎస్‌లకు కీలక శాఖల బాధ్యత

CM KCR: తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమవుతున్నారా ? ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేయాలనే కార్యాచరణకు ముఖ్యమంత్రి దిశా నిర్దేశం చేస్తున్నారా..? ఇందుకోసం బ్యూరోక్రాట్లను కూడా రంగంలోకి దింపనున్నారా? ఈ మేరకు సమర్థులైన ఐఏఎస్, ఐపీఎస్ లకు కీలక బాధ్యతలను అప్పగించనున్నారా.? దీనిపై హెచ్ఎం టీవీ స్పెషల్ స్టోరీ.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అభివృద్ధి మంత్రాన్ని జపిస్తున్నారు. తెలంగాణలో మొదటి సారి 2014 లో అధికారంలోకి వచ్చాక పెన్షన్లు, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, రుణమాఫీ, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాలేశ్వరం ప్రాజెక్టు, 24 గంటల నిరంతర విద్యుత్, రైతుబంధు లాంటి పథకాలను తీసుకొచ్చి రాష్ట్ర ప్రజలను తమ వైపు తిప్పుకున్నారు. 2018 లో టీఆర్ఎస్ నేతృత్వంలో 88 అసెంబ్లీ సీట్లు సాధించి మరోసారి విజయ డంకా మోగించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. ఆ తర్వాత అనేక పథకాలను ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకొచ్చారు. కేసీఆర్ కిట్, దళిత బంధు, కంటి వెలుగు, గిరిజన బంధు ఇలా అనేక రకాల స్కీములను ప్రవేశపెట్టారు. ఒక వైపు పరిపాలనా పరంగా ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూనే ప్రజల సంక్షేమ, అభివృద్ధి విషయంలో వెనుకంజ వేయకుండా ముందుకు సాగుతున్నారు.

తెలంగాణలో మరోసారి హ్యాట్రిక్ తో అధికారం చేజిక్కించుకునేందుకు గులాబీ అధినేత  కొత్త ఆలోచలతో ముందుకు సాగుతున్నారు. టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చి జాతీయ జెండాను ఎత్తుకొని ప్రజల్లో పార్టీని నిత్యం ఉండేలా చేశారు. అదే విధంగా ప్రభుత్వాన్ని సమర్థవంతంగా పనిచేసేలాగా బ్యూరో క్రాట్లకు శాఖల బాధ్యతలను అప్పగిస్తున్నారు. ఇప్పటికే పోలీసు విభాగంలో కీలక శాఖలను మార్చారు. డీజీపీగా అంజని కుమార్ ను నియమించారు. హోం శాఖలోని మరికొన్ని విభాగాల బాధ్యతలను కూడా సమర్థవంతమైన ఐపీఎస్ లకు అప్పగించేందుకు ఇప్పటికే రంగం సిద్ధం చేశారు. మరోవైపు సర్కారులో కీలక శాఖలన్నీ బీహార్ కి చెందిన ఐఏఎస్ ల వద్దనే ఉన్నాయని ఆరోపణలను తెలంగాణ ప్రభుత్వం ఎదుర్కొంటుంది. తాజాగా పోలీస్ శాఖ బదిలీల పై కూడా టీపీసీసీ నేత రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై విమర్శలు చేశారు. తెలంగాణ ఐపీఎస్ కేడర్ కు అన్యాయం జరిగిందని ఆరోపించారు.

అలాంటి మచ్చ ప్రభుత్వం పై రాకుండా తెలంగాణ సీఎస్ గా తెలుగు మహిళ అధికారిని నియమించారు ముఖ్యమంత్రి కేసీఆర్. ఈసారి ఎలాంటి ఆరోపణలు రాకుండా సమర్ధులైన ఐఏఎస్ అధికారులకు, ఐపీఎస్ అధికారులకు ఆయా ముఖ్య విభాగాలను అప్పగించాలని కేసీఆర్ భావిస్తున్నారని అధికార వర్గాల్లో చర్చ సాగుతుంది. బీహార్ రాష్ట్రానికి చెందిన ఐఏఎస్ అధికారుల వద్దనే కీలక శాఖలు ఉన్నాయనే ఇతర ఐఏఎస్ లో ఆరోపణలు నేపథ్యంలో ఈసారి సమర్థులైన అందరికీ ముఖ్యమైన శాఖలను అప్పగించేందుకు ఇప్పటికే లిస్టు రెడీ అయిందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి ఆమోదంతో అతి త్వరలోనే దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా వెలబడునున్నాయి.

కీలక , ముఖ్యమైన శాఖలన్నింటినీ సమర్ధులైన అధికారులకు అప్పగించి, నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందేలా చేసేందుకు సీఎం కేసీఆర్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా అతి త్వరలో బ్యూరోక్రాట్ల బదిలీలను చేపట్టనున్నారు. తద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అవకాశం ఏర్పడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎవరెవరికి ఏఏ శాఖలు కేటాయించబోతున్నారనేది ఇప్పుడు ప్రభుత్వ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News