హుజూర్ నగర్‌లో క్యాంపెయిన్ హీట్..ప్రచార బరిలోకి సీఎం కేసీఆర్

Update: 2019-10-17 05:21 GMT

హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచార బరిలోకి సీఎం కేసీఆర్ కాసేపట్లో ఎంట్రీ ఇవ్వనున్నారు. మరో రెండు రోజుల్లో ఎన్నికల ప్రచారం ముగియనున్న నేపధ్యంలో హుజూర్ నగర్‌లో నిర్వహించే భారీ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొనున్నారు. సీఎం పర్యటన నేపధ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేశారు. సీఎం పాల్గొనే బహిరంగ సభ ప్రాంగణంతో పాటు వెళ్లే మార్గంలో రెండు వేల మంది పోలీసులను మోహరించారు. ఆర్టీసీ కార్మికుల ఆందోళనలు, విపక్షాల నిరసనల నేపధ్యంలో పోలీసులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. సీఎం పాల్గొనే బహిరంగ సభలో కూడా ఎలాంటి నిరసనలు చోటు చేసుకోకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.

సభను విజయవంతం చేసేందుకు జిల్లాకు చెందిన తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను మంత్రులు, జగదీశ్‌ రెడ్డి, సత్యవతి రాథోడ్ , ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి దగ్గరుండి పర్యవేక్షించారు. రాజకీయ సమీకరణాలు మారుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ప్రచారానికి వస్తూ ఉండటంతో రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆసక్తి నెలకొంది. కేసీఆర్ తన ప్రసంగంలో ఆర్టీసీ సమ్మెతో పాటు విపక్షాల తీరును ప్రధానంగా ప్రస్తావించే అవకాశాలున్నట్టు రాజకీయ పరిశీలకులు,పార్టీ నేతలు భావిస్తున్నారు.

హుజూర్ నగర్‌లో గెలుపు తమదేనంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. రాజకీయ ప్రయోజనాల కోసం విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రజలు గుర్తించారని ఎమ్మెల్సీ పల్లారాజేశ్వర్ రెడ్డి అన్నారు. అభివృద్ధిని అడ్డుకునేలా ప్రవర్తిస్తున్న ప్రతిపక్షాలకు ప్రజలు ఓటుతోనే బుద్ధి చెబుతారని పల్లా అంటున్నారు.  

Tags:    

Similar News