వైద్యరంగంలో మరో చీకటికోణం..నీలోఫర్‌లో క్లినికల్‌ ట్రయల్స్‌ కలకలం

Update: 2019-10-01 06:31 GMT

తల్లి కడుపు నుంచి బయటకు వచ్చి అప్పుడే జీవం పోసుకున్న నవజాత శిశువులపై ఫార్మా కంపెనీలు విషం చిమ్మాయి. ఏడాది పాటు ఏకంగా 300 మంది చిన్నపిల్లలపై క్లినికల్ ట్రయల్స్‌ నిర్వహించాయి. రాష్ట్రంలోనే అతిపెద్ద పిల్లల ఆస్పత్రి అయిన నీలోఫర్‌లో జరిగిన దారుణాలపై క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ నివేదిక వెల్లడించడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనపై సీరియస్ అయిన ప్రభుత్వం త్రిసభ్య కమిటీ వేసి విచారణకు ఆదేశించింది.

వైద్యరంగంలో మరో చీకటికోణం వెలుగుచూసింది. నిబంధనలకు విరుద్ధంగా, ఎలాంటి అనుమతులు లేకుండా ప్రసిద్ధ నీలోఫర్‌ ఆస్పత్రిలో నవజాత శిశువులు, చిన్నారులపై క్లినికల్‌ ట్రయల్స్‌ జరిగాయన్న నివేదికలు కుదిపేసింది. ఒకరు కాదు ఇద్దరు కాదు గతేడాది మే నుంచి ఏకంగా 300 మంది పిల్లలపై ఔషద ప్రయోగాలు జరిగాయని క్లినికల్‌ ట్రయల్స్‌ రిజిస్ట్రీ ఆఫ్ ఇండియా నివేదిక వెల్లడించింది. ఇన్‌పేషెంట్లుగా వచ్చిన నవజాత శిశువులు మొదలు 14 ఏళ్లలోపు పిల్లలపైనే ఈ ప్రయోగాలు జరిగినట్లు నివేదికలో తేటతెల్లమైంది.

క్లినికల్‌ ట్రయల్స్‌ జరిపిన పిల్లలను ముందుగా వయస్సుల వారీగా విభజించి ఆ తర్వాత మూడు వార్డుల నుంచి 300 మంది పిల్లలను ఎంపిక చేసి యాంటీ బయోటిక్స్‌ మందులను ప్రయోగించారు. జనరల్‌ వార్డు, పీడియాట్రిక్‌ ఇంటెన్సివ్ కేర్, నియోనాటల్‌ ఇంటెన్సివ్ కేర్ నుంచి వంద చొప్పున ఎంపిక చేశారు. అంతేకాకుండా రోగాల వారీగా మగ, ఆడపిల్లలను ఓ ప్రణాళికా బద్దంగా విభజించి వారిపై ఔషధాలను ప్రయోగించారు. ఆ మందు వారిపై ఎలా పనిచేసింది..? దాని సామర్థ్యమెంత..? ఇతర మందులతో పోలుస్తూ అధ్యయనాలు జరిగాయని నివేదిక వెల్లడించింది.

చిన్నారుల ప్రాణాలను పణంగా పెట్టి ప్రయోగాలు చేయడంపై రాష్ట్రప్రభుత్వం సీరియస్‌ అయ్యింది. త్రిసభ్య కమిటీ వేసి విచారణకు ఆదేశించింది. ప్రిన్సిపల్‌ సెక్రటరీ రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటైన కమిటీలో డాక్టర్‌ రాజారావు, లక్ష‌్మీ కామేశ్వరి, విమలా థామస్ ఉన్నారు. వీరు సుమారు 5 గంటల పాటు నీలోఫర్‌లో విచారణ చేపట్టారు. అయితే కమిటీ విచారణకు సహకరిస్తున్నామని.. ఎంతమందిపై ట్రయల్స్‌ జరిగాయి..? వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందనే దిశగా విచారణ జరుగుతుందని నీలోఫర్‌ సూపరింటెండెంట్‌ మురళీకృష్ణ తెలిపారు.

అయితే క్లినికల్ ట్రయల్స్‌ నిబంధనల ప్రకారమే జరుగుతున్నాయని.. ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రొఫెసర్‌ రవికుమార్.. చెబుతున్నారు. కమిటీకి అన్ని రకాలుగా సహకరిస్తున్నట్లు వివరించారు. తనపై వచ్చిన ఆరోపణలన్నీ అవాస్తవాలని కొట్టిపారేశారు. తమ అనుమతి తీసుకున్న తర్వాతే తమ పిల్లలపై ఔషధ ప్రయోగం చేశారని నీలోఫర్‌కు వచ్చిన కొందరు చిన్నారుల తల్లిదండ్రులు చెబుతున్నారు. విడతలవారీగా తమ పిల్లలకు వ్యాక్సిన్‌ ఇచ్చారని ఎప్పటికప్పుడు ఆరోగ్య వివరాలు అడిగి తెలుసుకుంటున్నారని చెప్పుకొచ్చారు.

నీలోఫర్‌లో ఇద్దరు వైద్యులు ఈ క్లినికల్‌ ట్రయల్స్‌లో పాల్గొనగా, ఫార్మా కంపెనీల ప్రతినిధులు, ఇతరులు వారికి సహాయకులుగా ఉన్నట్లు తేలింది. నీలోఫర్‌లో గత పదేళ్లుగా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇంకా గాంధీ, ఉస్మానియా, నిమ్స్‌ ఆస్పత్రుల్లో కూడా క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతున్నాయని నివేదిక వెల్లడించింది.

Full View  

Tags:    

Similar News