TSPSC: TSPSC బోర్డు ప్రక్షాళన కు లైన్ క్లియర్
TSPSC: లోక్‌సభ ఎన్నికలలోపే కమిషన్ ఏర్పాటుపై నిర్ణయం ఉంటుందా అనే ఆసక్తి
TSPSC: TSPSC బోర్డు ప్రక్షాళన కు లైన్ క్లియర్
TSPSC: TSPSC ప్రక్షాళనకు రంగం సిద్ధం అవుతోంది. ప్రస్తుతం ఉన్న బోర్డు మెంబర్స్ రాజీనామాలకు గవర్నర్ ఆమోదం తెలపడంతో కొత్త నియామకాలకు లైన్ క్లియర్ అయింది. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ప్రభుత్వ అభిప్రాయంతో రాజీనామాలను ఆమోదిస్తున్నట్లు రాజ్ భవన్ అధికారికంగా ప్రకటన చేసింది. దీంతో తదుపరి ప్రభుత్వ అడుగు ఎలా ఉండబోతోంది..? త్వరతగతిన కొత్త కమిషన్ టీమ్‌ను ఏర్పాటు చేస్తుందా..? గతంలో రాజకీయ పునరావాసానికి TSPSC నెలవుగా మారిందనే విమర్శలు వచ్చాయి.
మరి కాంగ్రెస్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది. ఎవరెవరిని ఇందులో నియమించబోతోంది. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా జాబ్ క్యాలెండర్ ప్రకారమే ఉద్యోగాలను భర్తీ చేస్తారా..? పెండింగ్‌లో ఉన్న గ్రూప్-1, గ్రూప్-2తో పాటు ఇతర పరీక్షల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు. ఏడాది లోపు లక్షకుపైన ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పిన సీఎం రేవంత్.. మాట నిలబెట్టుకుంటారా.? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి.
పేపర్ల లీకేజీ, పారదర్శకంగా నియామాకాలు చేపట్టకపోవడంతో అప్రతిష్టను మూటగట్టుకుంది గత TSPSC బోర్డు. నిరుద్యోగుల ఆగ్రహానికి గురై.. బీఆర్ఎస్ ఓటమిలో TSPSC బోర్డు పాత్ర కూడా చాలానే ఉంది. ఎన్నికల ప్రచారంలో నాటి ప్రతిపక్షాలకు ఇదో అస్త్రంగా మారింది. తాము అధికారంలోకి వస్తే.. బోర్డును ప్రక్షాళన చేసి సమర్ధవంతగా పరీక్షలు నిర్వహిస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి దాని ప్రకారమే ఖాళీలను చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.
అనంతరం అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. చెప్పినట్టుగానే TSPSC బోర్డు ప్రక్షాళనపై దృష్టి పెట్టింది. ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల లోపే కమిషన్ సభ్యులు రాజీనామా చేసేలా వారిని ఒప్పించింది. తాజాగా టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డి, సభ్యులు కారం రవీందర్ రెడ్డి, సత్యనారాయణ, బండి లింగారెడ్డి రాజీనామాలను గవర్నర్ తమిళసై సౌందర్ రాజన్ ఆమోదం తెలపడంతో.. కొత్త బోర్డు నియామకానికి అడ్డంకులు తొలగినట్టు అయింది.
రాజీనామాల ఆమోదంపై గవర్నర్ ఎలాంటి జాప్యం చేయలేదని, జాప్యం చేసినట్లు వస్తున్న వార్తలను గవర్నర్ కార్యాలయం ఖండించింది. సభ్యుల నుంచి రాజీనామా పత్రాలు అందగానే బిజినెస్ రూల్స్ ప్రకారం న్యాయనిపుణుల అభిప్రాయం కోసం అదే విధంగా సభ్యుల రాజీనామాపై ప్రభుత్వం యొక్క అభిప్రాయం కూడా గవర్నర్ తెలుసుకున్నారు. లీగల్ ఒపీనియన్, మరోవైపు గవర్నర్ అడిగిన అంశాలకు ప్రభుత్వం నుంచి రాజ్ భవన్ కు సమాధానం వచ్చిన 24 గంటల్లోనే గవర్నర్ తమిళసై టిఎస్పిఎస్సి సభ్యుల రాజీనామాలను ఆమోదించినట్లు తెలిసింది రాజ్ భవన్ కార్యాలయం.
టిఎస్పిఎస్సి పేపర్ లీక్ వ్యవహారంలో సిట్ దర్యాప్తు కొనసాగుతున్న నేపథ్యంలో సభ్యుల రాజీనామాపై భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు ఎదురుకాకుండా ఉండేందుకే లీగల్ ఒపీనియన్ తీసుకోవడంతోపాటు ప్రభుత్వం యొక్క అభిప్రాయం కూడా గవర్నర్ తెలుసుకున్నారని రాజ్ భవన్ కార్యాలయం పేర్కొంది. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి గవర్నర్ పలు కీలక సూచనలు చేశారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో తప్పు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ సూచనలు చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని రాజీనామాలను వెంటనే ఆమోదిస్తున్నట్లు అధికారికంగా ప్రకటన చేశారు గవర్నర్.
సభ్యుల రాజీనామాను ఆమోదించడమే కాకుండా కొత్త బాడీ నియామకానికి లైన్ క్లియర్ చేశారు తమిళ సై. ఇక టీఎస్పీఎస్సీ బంతి రాజ్ భవన్ నుంచి ప్రభుత్వం చేతిలోకి వెళ్ళింది. బోర్డు ప్రక్షాళనలో భాగంగా ప్రభుత్వం కొత్త బాడీ నియామకం త్వరలోనే చేస్తుంది అన్న చర్చ జరుగుతుంది. ఆ తర్వాతే ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేసి నోటిఫికేషన్స్ ఇచ్చే ఆలోచనలో ఉంది ప్రభుత్వం. దీంతో పాటు పెండింగ్‌లో ఉన్న గ్రూప్-1, గ్రూప్-2, గ్రూప్-4 పరీక్షల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోనుంది అనే చర్చ జరుగుతోంది నిరుద్యోగుల్లో. ఏదేమైనా కొత్త బోర్డులో సమర్థులైన ఛైర్మన్, సభ్యులను నియామించాలని, ఎలాంటి అవకతకలకు చోటు లేకుండా.. పారదర్శకంగా పరీక్షలు నిర్వహించాలని నిరుద్యోగులు కోరుకుంటున్నారు.