Sankranti: తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. పల్లెబాట పట్టిన పట్నం వాసులు

Sankranti: 115 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంచిన దక్షిణ మధ్య రైల్వే

Update: 2024-01-13 13:00 GMT

Sankranti: తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సందడి.. పల్లెబాట పట్టిన పట్నం వాసులు

Sankranti: తెలుగురాష్ట్రాల్లో సంక్రాంతి సందడి మొదలైంది. పల్లెలన్నీ ప్రకృతి పండగను గ్రాండ్‌కు చేసేందుకు సిద్ధమవుతున్నాయి. దీంతో పట్నాల్లో నివాసం ఉంటోన్న పల్లెటూరు వాసులంతా సొంతూళ్ల బాట పట్టారు. తెలంగాణలో విద్యాసంస్థలకు సెలవులు ప్రారంభం కావడంతో ఉదయం నుంచి రవాణా ప్రాంగణాలన్నీ కిక్కిరిసిపోయాయి.

సంక్రాంతి కోసం జనం ఊళ్లకు వెళ్తుండటంతో అదనంగా బస్సులను నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ. అటు ఏపీ ఆర్టీసీ కూడా జిల్లాలకు అదనపు బస్సు సర్వీసులను అందుబాటులో ఉంచింది. అయినా కూడా బస్సుల్లో రద్దీ తగ్గడం లేదు. తెలంగాణలో మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పించడంతో మహిళా ప్రయాణికులు కూడా ఎక్కువగా బస్సులకే ప్రాధాన్యత ఇస్తున్నారు. జనం భారీగా బస్టాండ్లకు చేరుకోవడంతో jbs, mgbs కిటకిటలాడుతున్నాయి.

ప్రధానంగా ఏపీ రూట్‌లో భారీగా రద్దీ కనిపిస్తోంది. పల్లెబాట పట్టిన పట్నం వాసులంతా ప్రధాన బస్టాండ్లలోనూ కాకుండా నగరంలోని ఇతర బస్టాండ్లలో బస్సుల కోసం వస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ మార్గంలో వెళ్లే ప్రయాణికులతో కూకట్‌పల్లి, SR నగర్‌, దిల్‌సుఖ్‌నగర్‌, ఎల్బీ నగర్‌ బస్టాండ్లలో రద్దీ పెరిగింది. బస్టాండ్లలో ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ప్రధానమైన రూట్లలో సీసీటీవీలతో పరిస్థితిని మానిటరింగ్‌ చేస్తున్నారు అధికారులు.

హైదరాబాద్‌‌ నుంచి ఏపీ, తెలంగాణలోని వివిధ జిల్లాలకు బస్సులు అదనంగా నడుపుతున్నా.. ప్రయాణికుల రద్దీకి బస్సులు సరిపోవడం లేదు. దాంతో ప్రయాణికులు రైళ్లలో ప్రయాణించేందుకు మొగ్గు చూపుతున్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని దక్షిణ మధ్య రైల్వే అధికారులు 115 ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. రైళ్లలో ప్రయాణించే వారంతా స్టేషన్‌లకు చేరుకోవడంతో సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ జంక్షన్లు కూడా ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.

ఇక సొంత వాహనాలు, ప్రైవేట్ వాహనాలు కూడా తోడుకావడంతో హైదరాబాద్, విజయవాడ రూట్లో భారీగా ట్రాఫిక్ పెరిగింది. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర 16 టోల్‌ బూత్‌లు ఉండగా.. అయితే విజయవాడ వైపు వెళ్లే వాహనాల కోసమే 10 బూత్‌లు వినియోగిస్తున్నారు. వాహనాల రద్దీ పెరగకుండా ఉండేందుకు గాను ఫాస్టాగ్ స్కాన్ చేసేందుకు ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. పంతంగి టోల్‌ప్లాజా దగ్గర అదనపు సిబ్బందిని ఉంచి ట్రాఫిక్ జామ్‌ అవకుండా చర్యలు తీసుకుంటున్నారు.

Tags:    

Similar News