Revanth Reddy: ఆ జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులివ్వండి..సీఎం రేవంత్ ఆదేశం

Update: 2025-02-18 02:30 GMT

Revanth Reddy: ఆ జిల్లాల్లో వెంటనే రేషన్ కార్డులివ్వండి..సీఎం రేవంత్ ఆదేశం

 Revanth Reddy: రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీకి వెంటనే ఏర్పాట్లు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎన్నికల కోడ్ అమల్లో లేని జిల్లాల్లో మొదట పంపిణీ ప్రారంభించి..కోడ్ ముగిసిన తర్వాత మిగతా జిల్లాల్లోనూ చేపట్టాలన్నారు. ముఖ్యమంత్రి సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన సమీక్ష సమావేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.

పౌరసరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తదితర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఇప్పటికే పలుమార్లు దరఖాస్తుకు అవకాశం ఇచ్చినా మీ సేవా కేంద్రాల దగ్గర రేషన్ కార్డుల కోసం ఎందుకు రద్దీ ఉంటుందని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. దరఖాస్తు చేసిన కుటుంబాలే మళ్లీ మళ్లీ చేస్తుండడమే దీనికి కారణమంటూ అధికారులు వివరణ ఇచ్చారు. వెంటనే కార్డులిస్తే ఈ పరిస్థితి తలెత్తేది కాదని..వేగంగా జారీ చేసేందుకు చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. కొత్త కార్డుల జారీకి పలు డిజైన్లను కూడా పరిశీలించారు.

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని గనుల శాఖను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఇసుక రీచ్ లను జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తరుచూ తనిఖీ చేయాలన్నారు. రీచ్ ల దగ్గర అక్రమ రవాణాపై ముఖ్యమంత్రి అసంత్రుప్తి వ్యక్తం చేశారు. ఇసుక రీచ్ ల నుంచి జిల్లా రహదారులకు వచ్చే మార్గాల్లో చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని ఇసుక అక్రమ రవాణాను అరికట్టేందుకు దాడులు నిర్వహిస్తామని మైనింగ్ శాఖ ముఖ్యకార్యదర్శి శ్రీధర్ పేర్కొన్నారు. ఇసుక అక్రమాల నివారణకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలిచ్చిన నేపథ్యంలో మైనింగ్ శాఖ డైరెక్టర్ శశాంక, టీజీఎండీసీ ఎండీ సుశీల్ కుమార్ లతో కలిసి శ్రీధర్ సోమవారం మీడియాతో మాట్లాడారు.

ఇసుక గుత్తేదారులతో సమావేశం ఏర్పాటు చేసి..ఓవర్ లోడ్ చేయకుండా చర్యలు తీసుకుంటాము..తప్పులు జరిగితే ఆ గుత్తేదారు సంస్థను బ్లాక్ లిస్టులో పెడతామన్నారు. నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ఇసుకను 24గంటలూ బుకింగ్ చేసుకోవచ్చని..ఇసుక సరఫరా చేసే వాహనాలకు జీపీఎస్ ట్రాకింగ్ వ్యవస్థను అమర్చుతామని తెలిపారు. 45రోజుల్లో అక్రమాలన్నింటినీ అదుపు చేస్తామని..ఇసుక సరఫరా అక్రమాలపై 98480 94373, 70939 14343 నెంబర్లకు ఫిర్యాదు చేయవచ్చని పేర్కొన్నారు. 

Tags:    

Similar News