Allu Arjun : సంధ్యా థియేటర్ దగ్గర తోపులాటలో ఓ మహిళ మరణించిన కేసులో అరెస్టు అయిన సినీ నటుడు అల్లు అర్జున్ రాత్రంతా చంచల్ గూడ జైల్లోనే ఉన్నారు. ఖైదీలందరూ ఉండే బ్యారక్ వెళ్లిన తర్వాత ఆయనకు మంజీర బ్యారక్ ను కేటాయించారు. అనంతరం ఆయన్ను అక్కడికి తరలించారు. జైలు అధికారులు ఫుడ్ ఆఫర్ చేసినా అల్లు అర్జున్ తినలేదని సమాచారం. ఆయనకు కొత్త రగ్గు, దుప్పటి ఇవ్వగా వాటిని తిరస్కరించి..సాధారణ ఖైదీలాగే నేల మీద నిద్రించినట్లు తెలుస్తోంది.
14 రోజులు రిమాండ్ విధించినప్పుడు న్యాయాధికారి ఆయనకు ప్రత్యేక ఖైదీగా పరిగణించాలని ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ సౌకర్యాలు జైల్లోకి వచ్చిన మార్నాడు మాత్రమే అందుతాయి.
కాగా సంధ్య థియేటర్ లో జరిగిన ఘటనపై పోలీసులు క్లారిటీ ఇచ్చారు. అల్లు అర్జున్ అరెస్ట్ పై క్లారిటీ ఇచ్చారు సెంట్రల్ జోన్ డీసీపీ. భారీ ఈవెంట్లకు ముందస్తు అనుమతి తీసుకోవడం తప్పనిసరి. భారీ కార్యక్రమాలకు నిర్వాహకులు నేరుగా అధికారుల దగ్గరికి వచ్చి పర్మిషన్ తీసుకోవాలని తెలిపారు. కానీ ఈ ఘటనలో ఇన్వార్డ్ సెక్షన్ లో ఒక లెటర్ ఇచ్చి సంధ్య థియేటర్ యాజమాన్యం వెళ్లిపోయారని తెలిపారు. హీరో వస్తున్నారన్న విషయం గురించి ఎలాంటి సమాచారం ఇవ్వకపోయినా..మేము ముందస్తు చర్యలో భాగంగా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఈ ఘటన జరిగి 9రోజులు అవుతున్నా ఆ బాలుడు ఇంకా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన విధానంపైన కూడా క్లారిటీ ఇచ్చారు. పోలీసులు ఎక్కడా అల్లు అర్జున్ తో దురుసుగా ప్రవర్తించాలేదని తెలిపారు.