BRS: కాంగ్రెస్‌పై బాకీ కార్డు ఆర్మ్ బీఆర్ఎస్ పార్టీ వినూత్న ఉద్యమం
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఅరెస్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. 22 నెలల కాలంలో ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు బాకీ పడ్డ హామీలపై ఉద్యమం ప్రారంభించింది.
BRS: కాంగ్రెస్‌పై బాకీ కార్డు ఆర్మ్ బీఆర్ఎస్ పార్టీ వినూత్న ఉద్యమం
కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రతిపక్ష బీఅరెస్ వినూత్న కార్యక్రమం చేపట్టింది. 22 నెలల కాలంలో ప్రజలకు రేవంత్ రెడ్డి సర్కారు బాకీ పడ్డ హామీలపై ఉద్యమం ప్రారంభించింది. రాష్ట్రంలో ఏ ఏ వర్గానికి ప్రభుత్వం ఎంత బాకీ ఉందో తెలిసేలా కాంగ్రెస్ బాకీ కార్డు పోస్టర్‌ను విడుదల చేసింది గులాబీ పార్టీ. హామీల పేరుతో మోసం చేసిన కాంగ్రెస్ కు పంచాయతీ, జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చింది. మరి బాకీ కార్డు అస్త్రం.. కారు పార్టీకీ ఏ మేరకు బూస్టప్ ఇవ్వనుంది..? దీనికి కాంగ్రెస్ స్పందనేంటి..?
కాంగ్రెస్‌పై గులాబీ పార్టీ బాకీ కార్డు అస్త్రం
కాంగ్రెస్ ప్రభుత్వ హామీలపై బీఆర్ఎస్ పార్టీ సమరశంఖం పూరించింది. ఎన్నికల ముందు ఇచ్చిన గ్యారెంటీల్లో ఏ ఒక్కటీ అమలు కావడం లేదంటున్న గులాబీ పార్టీ.. రాష్ట్రం ప్రభుత్వం ఏ వర్గానికి ఎంతెంత బాకీ పడిందో లెక్కలతో సహా ప్రజల ముందుంచే ప్రయత్నం చేస్తోంది. హస్తం సర్కార్ వైఫల్యాలను బయటపెట్టేందుకు.. కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని మొదలుపెట్టింది బీఆర్ఎస్. తెలంగాణ భవన్‌లో మాజీ మంత్రులతో కలిసి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బాకీ కార్డు పోస్టర్ ను విడుదల చేశారు. కాంగ్రెస్ బాకీ కార్డులోని ప్రతీ అక్షరం రేవంత్ సర్కార్ మోసానికి నిలువుటద్దమని బీఅరెస్ ఆరోపించింది. తెలంగాణలో ఏ ఏ వర్గానికి కాంగ్రెస్ ప్రభుత్వం 22 నెలల్లో ఎంత బకాయి పడిందో బకాయి కార్డులో వివరాలు పొందు పరిచారు.
అన్నదాతల ఓట్లతో గెలిచిన కాంగ్రెస్ ప్రభుత్వం వారిని అడుగడుగునా దగా చేస్తోందని ఆరోపించింది బీఅరెస్. ఎకరానికి 15వేలు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. రైతులకు 2 లక్షల రుణమాఫీ పూర్తిస్థాయిలో నెరవేరలేదని, అదికూడా బాకేనని అన్నారు. మహాలక్ష్మి పథకం పేరుతో ఆడబిడ్డలను ఇంత దారుణంగా మోసం చేసిన ప్రభుత్వం మరొకటి లేదన్నారు బిఅరెస్ నేతలు. నెలకు 2,500 ఇస్తామని చెప్పి, ఈ రోజు వరకు ఒక్కో మహిళకు దాదాపు 55వేలు బాకీ పడ్డారని నిప్పులు చెరిగారు. ఈ ప్రభుత్వం వచ్చాక పెళ్లైన 8 లక్షల మంది ఆడబిడ్డలకు 8 లక్షల తులాల బంగారం బాకీ ఉందని.. ఇది నయవంచన కాదా అని మండిపడ్డారు.
వృద్ధులు, వితంతువుల ఉసురు ఈ ప్రభుత్వానికి తగలకుండా పోదని బీఅరెస్ నేతలు అన్నారు. నెలకు 4వేల పెన్షన్ ఇస్తామని చెప్పి 22 నెలలుగా ఒక్కొక్కరికి 44వేలు బాకీ పడ్డారని చెప్పారు. దివ్యాంగులకు నెలకు 6వేలు ఇస్తామని హామీ ఇచ్చి, కేసీఆర్ పెంచిన 4వేల మాత్రమే ఇస్తున్నారని మండిపడ్డారు గులాబీ నేతలు. అంటే ప్రతి నెలా 2వేలు కోత పెడుతూ ఒక్కో దివ్యాంగుడికి 44వేలు బాకీ ఉన్నారని ఆరోపించారు. వరికి 500 బోనస్ ఇస్తామని చెప్పి చేతులెత్తేశారని, అది కూడా బాకీనే అని చెప్పారు. ఇక కౌలు రైతులు, రైతు కూలీల కన్నీళ్లను పట్టించుకునే నాథుడే లేడని.. వారికి ఇస్తామన్న 15వేలు, 12వేలు ఏ గంగలో కలిపారని.. ఇవన్నీ బాకీ కాదా అని కేటీఆర్ నిలదీశారు.
యువతకు 2 లక్షల ఉద్యోగాల హామీ బాకీతో పాటు.. నెలకు 4వేల నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి, 22 నెలలుగా ప్రతి నిరుద్యోగికి వేలల్లో బాకీ పడిందని విమర్శించారు. ఈ మోసానికి కాంగ్రెస్ ఏం సమాధానం చెప్తుందని ప్రశ్నించారు. రాబోయే పంచాయతీ, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ది చెప్పాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చింది బీఅరెస్. రాష్ట్రంలోని ప్రతి ఇంటి తలుపు తట్టి, కాంగ్రెస్ బాకీల బండారాన్ని ప్రజలకు వివరిస్తామని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీ కార్డుకు విరుగుడే ఈ బాకీ కార్డు అని గులాబీ పార్టీ స్పష్టం చేసింది.
మొత్తానికి బీఆర్ఎస్ లేవనెత్తిన కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమం తెలంగాణలో సరికొత్త రాజకీయాలకు తెరతీసినట్టైంది. వ్యవసాయాన్ని పండగ చేశామని, రైతు రుణమాఫీ, రైతు భరోసా, సన్నబియ్యంకు 5వందల బోనస్.. ఇలా అన్ని విధాలా అన్నదాతను ఆదుకున్నామని కాంగ్రెస్ చెబుతున్న వేళ.. బీఆర్ఎస్ నేతల బాకీ కార్డు స్లోగన్ పొలిటికల్ హీట్‌ను పెంచుతోంది. అలాగే మహిళలను కాంగ్రెస్ సర్కార్ దగా చేసిందని కారు పార్టీ ఆరోపిస్తే.. ఫ్రీ కరెంట్, ఉచిత బస్సు ప్రయాణం, 5వందలకే గ్యాస్, ఇందిరమ్మ ఇండ్లు చూడరా అని హస్తం కౌంటర్ ఇస్తోంది. ఇక యువతకు ఇచ్చిన 2లక్షల ఉద్యోగ హామీపైనా.. వాద ప్రతివాదనలు జరుగుతున్నాయి. మొత్తానికి స్థానిక ఎన్నికల ముంగిట.. బీఆర్ఎస్ పూరించిన ఈ బాకీ కార్డు ఉద్యమం ఎటు టర్న్ తీసుకుంటుంది.. ఇది ప్రతిపక్ష పార్టీకి ఏ మేరకు మైలేజ్ ఇస్తుందనే చర్చ జరుగుతోంది.