ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్

Update: 2019-09-10 11:25 GMT

అధికార టీఆర్ఎస్‌ పార్టీకి ప్రత్యామ్నాయంగా ఎదగాలని చూస్తున్న బీజేపీ ఆ దిశగా పావులు కదుపుతోంది. ఇప్పటికే రోజురోజుకు బలహీనపడుతున్న కాంగ్రేస్‌తో పాటు ఉనికే కనుమరుగవుతున్న టీడీపీనే టార్గెట్‌గా కమలదళం ముందుకు సాగుతుంది. ఒక్కొక్కరుగా బీజేపీ గూటికి చేరుతుండటంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో బీజేపీ బలం పుంజుకుంటోంది. ఆ దిశగా పార్టీ అధినేతలు సైతం జిల్లాపై ఫోకస్ పెట్టారు.

ఉమ్మడి పాలమూరు జిల్లాలో భారతీయ జనతాపార్టీ బలోపేతం దిశగా అడుగులు వేస్తోంది. కాంగ్రెస్, టీడీపీ నేతలపై దృష్టి సారించి ఒక్కొక్కరిని తమ పార్టీలో చేర్పించుకుంటోంది. మొదటి నుంచి జిల్లాలో బీజేపీకి కొంత పట్టుంది. మారుతున్న రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో ఇతర పార్టీ నేతలను ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో లాగేస్తోంది.

ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకురాలు మాజీమంత్రి డీకే అరుణ, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి పి.చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి, దేవరకద్ర కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ ఇంచార్జి డోకూర్ పవన్‌కుమార్ కమలం గూటికి చేరారు. తాజాగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.చంద్రశేఖర్ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆయనతో పాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి జయశ్రీ కూడా బీజేపీలో చేరారు. ఇప్పటికే పూర్తిగా బలహీనపడిన టీడీపీలో ఉన్న ఒకరిద్దరు నేతలు సైతం ఇతర పార్టీలకు వెళ్తుండటంతో ఆ పార్టీ పరిస్థితి జిల్లాలో దయనీయంగా మారింది.

ఇప్పటి వరకు కాంగ్రెస్, టీడీపీ పార్టీ నేతలనే టార్గెట్ చేసిన బీజేపీ నేతలు ఇప్పుడు అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్న అసంతృప్త నేతలపై నజర్ పెట్టారు. పార్టీ నేతలతో సఖ్యతలేని, పార్టీలో ఉన్న అంతర్గత విభేదాల కారణంగా అధినేతలతో విభేదిస్తున్న వారి జాబితాను సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో అలాంటి వారితో చర్చించి వారికి తగు హామీ ఇచ్చి ఆకర్షించే ప్రయత్నాలు మొదలు పెట్టినట్టు ప్రచారం సాగుతోంది.

బీజేపీ నేతలు వేస్తున్న పాచికలతో కాంగ్రెస్‌, టీడీపీ, టీఆర్ఎస్ నేతల్లో వలసలు తప్పవనే భయం కనిపిస్తోంది. క్యాడర్‌ను కాపాడుకునేందుకు ఆయా పార్టీల నేతలు తంటాలు పడుతున్నారు. మొత్తంగా ఒకరి బలహీనత మరొకరికి బలంగా మారిందన్నట్టు కాంగ్రెస్, టీడీపీ బలహీనతలు బీజేపీకి కలిసివచ్చేలా కనిపిస్తోంది.

Full View

Tags:    

Similar News