Bhainsa Clashes: వరుస ఘటనలతో అట్టుడుకుతున్న భైంసా

Bhainsa Clashes: అల్లర్లు జరిగిన ప్రతీసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు బిక్కుబిక్కు మంటున్నారు.

Update: 2021-03-12 10:01 GMT

ఇమేజ్ సోర్స్;(ది హన్స్ ఇండియా)

Bhainsa Clashes: నిర్మల్‌ జిల్లాలోని సమస్యాత్మక ప్రాంతమైన భైంసా.. వరుస ఘటనలతో అట్టుడుకిపోతుంది. అల్లర్లు జరిగిన ప్రతీసారి హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో స్థానికులు బిక్కుబిక్కు మంటూ కాలం వెళ్లదీస్తున్నారు. ఇప్పటివరకు భైంసాలో ఏడుసార్లు ఇరువర్గాల మధ్య ఘర్షణలు చెలరేగితే పదుల సంఖ్యలో ప్రాణాలు పోగా.. కొంతమంది తీవ్ర గాయాలపాలయ్యారు. చెప్పాలంటే ఇరువైపులా ఆస్తినష్టం కూడా పెద్దఎత్తునే జరిగింది.

మొట్టమొదటి సారిగా 1992లో అల్లర్లు...

మొట్టమొదటి సారిగా 1992లో అల్లర్లు జరగ్గా.. తర్వాత 1993, 1996, 2008లో జరిగాయి. మళ్లీ 2020లో రెండుసార్లు.. 2021లో ఇప్పటివరకు ఒకసారి జరిగింది. చెప్పాలంటే 2008లో జరిగిన ఘర్షణలు భైంసాకు కొద్దీ దూరంలో ఉన్న వటోలి అనే గ్రామానికి పాకాయి. అక్కడ అల్లరిమూకలు ఓ ఇంటిని దగ్ధం చేయడంతో ఆరుగురు సజీవదహనమయ్యారు. అప్పట్లో ఈ ఘటన జాతీయస్థాయిలో కలకలం రేపింది. ఇక వరుస ఘటనలకు కారణాలు ఏవైనప్పటికీ జనం ఇబ్బందులు పడుతున్నారు.

భైంసాలో ఇండ్లకే పరిమితమవుతున్న జనం...

ముఖ్యంగా భైంసాలోని ఉద్రిక్తత పరిస్థితులతో జనం ఇండ్లకే పరిమితం కావాల్సి వస్తోంది. రోజుల తరబడి మార్కెట్లు మూసి ఉండటంతో తిప్పలు పడుతున్నారు. ఉపాధి అవకాశాలు లేక రోజువారీ కూలీలు సతమతమవుతున్నారు. నిరుపేదలు తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. ఇక పరిస్థితులు ఇలాగే కొనసాగితే బ్రతకడమే కష్టమంటున్నారు సామాన్య ప్రజలు. పోనీ ఎక్కడికైనా వెళ్ళిపోదామని అనుకుంటే ఉన్న ఊరును విడిచి వెళ్లడం బాధగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

భైంసా అల్లర్లకు యువతే ప్రధాన కారణం..!

చెప్పాలంటే.. భైంసా అల్లర్లకు అక్కడున్న యువత ప్రధాన కారణంగా తెలుస్తోంది. వారిలో చాలామంది నిరక్షరాస్యులే కావడంతో ఉపాధి అవకాశాలు లేక.. చెడుతిరుగులకు అలవాటుపడుతున్నారని సమాచారం. దీంతో కొంతమంది యువకుల మధ్య జరిగిన చిన్నచిన్న గొడవలు ఘర్షణల వరకు దారితీస్తున్నాయి. అయితే కొంతమంది పెద్దలు స్వార్థ ప్రయోజనాల కోసం అల్లర్లను ప్రోత్సహిస్తున్నారు. ఇదిలా ఉండగా.. భైంసా అల్లర్ల వెనుక కొన్ని రాజకీయ శక్తులు కూడా పనిచేస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక భైంసాలో జరుగుతున్న వరుస ఘటనలు పోలీసులకు సవాల్‌గా మారాయి. ముఖ్యంగా గొడవలు జరిగిన ప్రతీసారి పరిస్థితి కంట్రోల్‌ చేయడంపైనే దృష్టి పెడుతున్నారు పోలీసులు.

Tags:    

Similar News