Basara IIIT Students: పట్టువీడని ప్రభుత్వం.. మెట్టు దిగని విద్యార్థులు

Basara IIIT Students: వెనక్కి తగ్గని ట్రిపుల్ ఐటీ విద్యార్థులు

Update: 2022-06-18 02:58 GMT

పట్టువీడని ప్రభుత్వం.. మెట్టు దిగని విద్యార్థులు

Basara IIIT Students: ట్రిపుల్ ఐటీ విద్యార్థులు పట్టువీడటం లేదు. సమస్యలు పరిష్కరించే వరకు వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. నాలుగో రోజు కూడా క్యాంపస్ ఆవరణలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుకుని నిరసన తెలిపారు. క్లాసులు బహిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ.. ఆందోళన చేపట్టారు. మరోవైపు పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. మెయిన్ గేట్ దగ్గర బారికేడ్లు పెట్టి పహారా కాస్తున్నారు. మీడియాను కూడా యూనివర్శిటీ పరిసరాల్లోకి అనుమతించడం లేదు.

మరోవైపు ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సంఘీభావం ప్రకటించేందుకు వెళ్తున్న బీజేపీ తెలంగాణ అధ్యక్షడు బండి సంజయ్ ను పోలీసులు అడ్డగించారు. కామారెడ్డి జిల్లా బికనూర్ టోల్ గేట్ దగ్గర బండి సంజయ్ కాన్వాయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. ముందుకు వెళ్లకుండా వాహనాలకు వలయంగా నిల్చున్నారు. దీంతో బీజేపీ కార్యకర్తలు పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే జాతీయరహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. దీంతో పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది.

ఇటు బాసర ట్రిపుల్ ఐటీ దగ్గర పోలీసులు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు. యూనివర్శిటీ క్యాంపస్ లోకి వెళ్లేందుకు ప్రయత్నించిన రేవంత్ ను.. అదుపులోకి తీసుకున్నారు. అలాగే దిలావర్పుర్ టోల్ ప్లాజా దగ్గర కాంగ్రెస్ నాయకులను పోలీసులు అడ్డుకున్నారు. ట్రిపుల్ ఐటీ విద్యార్థులకు సంఘీభావం తెలిపేందుకు వెళ్తున్న వారిని.. పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఏఐసీసీ కమిటీ ఛైర్మన్ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది.

ఇదిలా ఉంటే.. బాసర ట్రిపుల్ ఐటీ క్యాంపస్ ను.. ఏబీవీపీ స్టూడెంట్స్ ముట్టడించారు. యూనివర్శిటీ మెయిన్ గేట్ ముందుకు ఒక్కసారిగా చేరుకున్న విద్యార్థీ నాయకులు.. లోపలికి వెళ్లేందుకు దూసుకెళ్లారు. దీంతో అక్కడే ఉన్న పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది.. ఆందోళనకారులను అడ్డుకున్నారు. వీ వాంట్ జస్టిస్ అంటూ లోనికి వెళ్లేందుకు ప్రయత్నించిన వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో అక్కడ కాసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఆందోళనకారులను పోలీసు వాహనంలో అక్కడి నుంచి తరలించారు.

Tags:    

Similar News