Dharmapuri Arvind: నిజామాబాద్ లో రెండోసారి గెలుపు కోసం అర్వింద్ ప్రచారం

Dharmapuri Arvind: నియోజకవర్గంలో బీజేపీకి బలమైన పునాదులు.. మోడీ హవా

Update: 2024-03-14 09:29 GMT

Dharmapuri Arvind: నిజామాబాద్ లో రెండోసారి గెలుపు కోసం అర్వింద్ ప్రచారం

Dharmapuri Arvind: ఇప్పుడు అందరి దృష్టీ నిజామాబాద్ లోక్ సభ సీటు మీదనే ఉందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆ సీటుకు అంత బలమైన నేపథ్యం ఉంది మరి. అయితే బీజేపీ నుంచి సిట్టింగ్ ఎంపీగా ధర్మపురి అర్వింద్ బరిలో ఉండగా.. బీఆర్ఎస్ నుంచి బాజిరెడ్డి గోవర్ధన్ ని ఆ పార్టీ రంగంలోకి దింపుతోంది. కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరూ ఖరారు కాకున్నా.. అర్వింద్ పై గోవర్ధన్ ను దింపుతున్న విషయంలో అది ఎవరికి నష్టం కలిగిస్తుందన్న అంశం ఆసక్తికరంగా మారింది.

నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో ఆసక్తికరమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ధర్మపురి అర్వింద్ రెండోసారి గెలిచేందుకు ప్రచార పర్వంలో మునిగిపోగా.. బీఆర్ఎస్ అధిష్టానం అర్వింద్ మీద మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్ ను కన్ఫామ్ చేసింది. అయితే అర్వింద్, గోవర్దన్.. ఇద్దరూ మున్నూరు కాపు సామాజికవర్గానికి చెందినవారే కావడంతో ఆయా పార్టీల అధిష్టానాల ఉద్దేశాలు, ఇక్కడ పోలింగ్ మీద చూపే ప్రభావాలపై ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. ఇప్పటికైతే కాంగ్రెస్ నుంచి ఇంకా ఎవరూ కన్ఫామ్ కాకపోవడంతో.. అర్వింద్ పై గోవర్దన్ ను దింపే వ్యూహం లోతుపాతుల గురించి నియోజకవర్గ ప్రజానీకం చర్చించుకుంటోంది.

బాజిరెడ్డి గోవర్దన్ ను బీఆర్ఎస్ అధిష్టానం ఎంపిక చేయడంలోనే సామాజికవర్గాల సమీకరణను దృష్టిలో ఉంచుకొని జరిగిందన్న అభిప్రాయాలు అర్వింద్ శిబిరం నుంచి వినిపిస్తున్నాయి. అర్వింద్, గోవర్దన్ ఇద్దరూ ఒకే సామాజికవర్గానికి చెందినవారు కావడం వల్ల ఇక్కడ కీలకంగా మారిన మున్నూరు కాపుల ఓట్లు చీలిపోతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే చీలిపోయే మున్నూరు కాపుల ఓట్లు ఎవరివి అన్న చర్చ జోరుగా నడుస్తోంది. చీలే ఓట్లు కాంగ్రెస్ వాళ్లవా? బీజేపీ వాళ్లవా? అనే చర్చ నడుస్తోంది. కాపుల ఓట్లు చీల్చి అర్వింద్ గెలుపును ఈసారి అడ్డుకోవడమే ఉద్దేశంగా బీఆర్ఎస్ అధిష్టానం గోవర్దన్ ను రంగంలోకి దింపిందని.. అయితే ఆ నిర్ణయంతో నిజానికి బీజేపీకే అడ్వాంటేజ్ గా మారే అవకాశం ఉందన్న విశ్లేషణలు నియోజకవర్గంలో వినిపిస్తున్నాయి. మాజీ ఎంపీ కవితను కాకుండా గోవర్దన్ ను ఎంచుకోవడం అందుకేనంటున్నారు.

బాజిరెడ్డి గోవర్ధన్ 70 సంవత్సరాలకు పైబడ్డ నాయకుడు. ఆయన రాజకీయ జీవితంలో ఎక్కువ కాలం కాంగ్రెస్ లోనే ఉన్నారు. ఆయనకు ఉన్న రాజకీయ సంబంధాలన్నీ ఎక్కువగా కాంగ్రెస్ తోనే అనేది బహిరంగ రహస్యంగానే చెప్పుకుంటారు. ఇటీవల అసెంబ్లీఎన్నికల ఫలితాల నేపథ్యంలో బీఆర్ఎస్ ప్రాభవం గణనీయంగా పడిపోయింది. దీంతో ఈయనకు గల కాంగ్రెస్ సంబంధాల వల్ల కాంగ్రెస్ లో ఉన్న మున్నూరుకాపు ఓట్లు... అలాగే కాంగ్రెస్ సాధారణ ఓటు బ్యాంకు చీలే అవకాశం ఉందని.. దానివల్ల కాంగ్రెస్ కే తీవ్రమైన నష్టం కలుగుతుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

మరోవైపు నిజామాబాద్ నియోజకవర్గంలో బీజేపీకి బలమైన పునాదులున్నాయి. దానికి అదనంగా ఇప్పుడు దేశంలో మోడీ హవా నడుస్తున్నందున... యూత్, సామాన్యుల ఓట్లు భారీ సంఖ్యలో బీజేపీ వైపు మరలుతాయన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బీజేపీ సిద్ధాంత బలిమితో నడిచే పార్టీ గనక.. ఆ పార్టీ ఓట్లు చీలిపోయే పరిస్థితే ఉండదని.. బాజిరెడ్డి గోవర్దన్ పూర్వాశ్రమ ప్రభావం చేత చీలిపోయేవి కాంగ్రెస్ ఓట్లేనని కమలం శిబిరంలో ఆనందం వ్యక్తమవుతోంది. మరోవైపు నిజామాబాద్ లో బీజేపీ గత ఆరేళ్లలో సంస్థాగతంగా బాగా బలపడింది. బలమైన నాయకుల చేరికలతో గత ఎన్నికల్లో బాజిరెడ్డికి దీటుగా మున్నారుకాపు నాయకుడు, జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి నిర్వహిస్తున్న పాత్ర అర్వింద్ కు బాగా కలిసొస్తుందన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. మొత్తానికి బీజేపీ ఓటు బ్యాంకు చీల్చే ఉద్దేశంతో బీఆర్ఎస్ అధిష్టానం బాజిరెడ్డి గోవర్దన్ ను బరిలోకి దింపినా.. అందులో సక్సెస్ అవడం అంత ఆశామాషీ కాదన్న వ్యాఖ్యలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అందువల్ల గోవర్దన్ ఎంపిక అనేది అర్వింద్ కు ప్లస్ పాయింట్ గా మారుతుందన్న బలమైన వ్యాఖ్యలు వినిపిస్తుండడం విశేషం.

Tags:    

Similar News