వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల స్వరూపం, పేర్ల మార్పుకు అడుగులు

* నేటితో ముగియనున్న నోటిఫికేషన్ గడువు * అభ్యంతరాల పరిశీలన అనంతరం పేర్ల మార్పుకు కసరత్తు

Update: 2021-08-10 04:42 GMT

హన్మకొండ పట్టణం(ఫైల్ ఫోటో)

Warangal: వరంగల్‌ అర్బన్‌, రూరల్‌ జిల్లాల స్వరూపం పేర్ల మార్పుకు వేగంగా అడుగులు పడుతున్నాయి. అభ్యంతరాలు, సలహాలు ఇవ్వాలంటూ గత నెల 12న ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీచేసింది. ఈ నోటిఫికేషన్‌ గడువు నేటితో ముగియనుంది. వరంగల్‌ అర్బన్‌ జిల్లా పేరును హన్మకొండగా, వరంగల్‌ రూరల్‌ జిల్లా పేరును వరంగల్‌ జిల్లాగా పేర్లు మారుస్తున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అభ్యంతరాల స్వీకరణ, పరిశీలన అనంతరం జిల్లాల పేర్ల మార్పును ప్రకటిస్తారు.

హన్మకొండ జిల్లాలో హన్మకొండ, పరకాల రెవెన్యూ డివిజన్లు ఉంటాయి. 12 మండలాలు, 139 రెవెన్యూ గ్రామాలు హన్మకొండ జిల్లా పరిధిలోకి వస్తాయి. వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గం కేంద్రంగా హన్మకొండ జిల్లా కేంద్రం కొనసాగుతుంది.

ఇక వరంగల్, నర్సంపేట రెవెన్యూ డివిజన్లతో వరంగల్‌ జిల్లా ఏర్పడనుంది. 15 మండలాలు, 217 రెవెన్యూ గ్రామాలు ఈ జిల్లా కిందికి వస్తాయి. మొత్తానికి పాలన కేంద్రం లేకుండా నాలుగేళ్లుగా నెట్టుకొచ్చిన వరంగల్‌ రూరల్‌ జిల్లాకు ఇప్పుడు వరంగల్‌ నగరం జిల్లా కేంద్రంగా మారనుంది.

వరంగల్‌ అర్బన్‌ జిల్లాలోని వరంగల్, ఖిలా వరంగల్‌ మండలాలు వరంగల్‌లో కలవగా, వరంగల్‌ రూరల్‌లోని పరకాల, నడికుడ, దామెర మండలాలు హన్మకొండ జిల్లాలో కలిశాయి. అయితే ఈ మండలాల నుంచి ఆయా జిల్లాల కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు. అలాగే ఆత్మకూరు, శాయంపేట మండలాల నుంచి కూడా విజ్ఞప్తులు అందాయి. అయితే పరకాలను

అమరవీరుల జిల్లాగా ప్రకటించాలని డిమాండ్‌ వినిపిస్తోంది. ఇందుకోసం నెలరోజులుగా పరకాలలో ఆందోళనలు, ర్యాలీలు చేపడుతున్నారు. ఈ మేరకు ఈరోజు నుంచి 48 గంటల పాటు పరకాల పట్టణ బంద్‌కు పిలుపునిచ్చింది అఖిలపక్షం.

Tags:    

Similar News