Hyderabad: ORR సర్వీసు రోడ్‌లో డేంజర్ బెల్స్.. అసాంఘీక కార్యకలాపాలకు అడ్గాగా..

Hyderabad: హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది.

Update: 2025-02-03 01:06 GMT

Hyderabad: ORR సర్వీసు రోడ్‌లో డేంజర్ బెల్స్.. అసాంఘీక కార్యకలాపాలకు అడ్గాగా..

Anti-Social Activities at Hyderabad

Hyderabad: హైదరాబాద్‌కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్డు నేరాలు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుతోంది. ప్రయాణికులకు ఆహ్లాదకర వాతావరణం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఓఆర్ఆర్ ఇరువైపులా దాని పరిధిలోని ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటగా ప్రస్తుతం అవి ఏపుగా పెరిగాయి. దీనికితోడూ ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం, రాత్రుల్లో చీకటిగా ఉండడంతో ఇదే అదునుగా కొందరు అసాంఘిక కార్యకలాపాలు సాగిస్తున్నారు.

ఓఆర్ఆర్ డేంజర్స్‌గా మారింది. చీకటి పడిదంటే చాలు ఆ ప్రాంతం గుండా ప్రయాణించాలంటే హడలిపోతన్నారు. ఓఆర్ ఆర్ ప్రధాన రహదారిలో ప్రభుత్వం విద్యుత్ లైట్లను ఏర్పాటు చేసింది. కానీ సర్వీస్ రోడ్డులో మాత్రం చిన్నపాటి లైట్లు కూడా లేవు. దీంతో పాదచారులు, సమీప గ్రామాల వారు రాత్రి వేళల్లో సర్వీస్ రోడ్డు వైపు వెళ్లాలంటేనే జంకుతున్నారు. ముఖ్యంగా ఓఆర్ఆర్ అండర్ పాస్ బ్రిడ్జిల కింద ప్రేమికులు, వివాహేతర సంబంధాలు గల వారు రాత్రి వేళల్లో ఇక్కడే అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో సర్వీస్ రోడ్డు ఉంది. పోలీస్ పెట్రోలింగ్ వాహనాలు సైతం నిఘా పెట్టకపోవడంతో వారిని అడ్డుకునే వారే లేకుండా పోయారు. కండ్లకోయ చౌరస్తా సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కనే ఉన్న ఖాళీ స్థలంలో చెట్లు పెరిగి నిర్మానుష్య ప్రదేశంగా మారింది. కొందరు పట్టపగలే చెట్లపొదల చాటున తమ దందా సాగించారు. స్పందించిన పోలీసులు వాటికి అడ్డుకట్ట వేశారు. కొన్ని నెలల పాటు పెట్రోలింగ్ చేయడంతో ఆగినా.. ప్రస్తుతం సర్వీస్ రోడ్డులో పోలీసుల లేకపోవడంతో పోకిరీలు మళ్లీ రెచ్చి పోతున్నారు.

శంషాబాద్‌లో గతంలో దిశా రేప్ ఘటన కలకలం రేపింది. ఇప్పుడు మళ్లీ అదే తరహాలో ఔటర్ రింగ్ రోడ్ మహిళలపై హత్యాచారాలకు కేర్ ఆఫ్ అడ్రస్స్ గా మారుతుంది. మేడ్చల్ నియోజకవర్గ పరిధిలోని ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డులో ఒక్కచోట కూడా సీసీ కెమెరాలు లేకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. సర్వీస్ రోడ్డులో ఏ ప్రమాదం, నేరాలు జరిగినా పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. కేసు దర్యాప్తులో కీలంగా వ్యవహరించే సీసీ కెమెరాలు లేక నిందితులను పట్టుకునేందుకు పోలీసులు నానాతంటాలు పడాల్సి వస్తోంది. ఈనెల 24న ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు పక్కన కల్వర్టు కింద జరిగిన దారుణ హత్య ఘటనను ఛేదించడంలో పోలీసులు మూడు రోజుల పాటు శ్రమించాల్సి వచ్చింది. చివరకు హత్యకు గురైన మహిళ చేతిపై పచ్చబొట్టుతో వేయించుకున్న పేర్లు, ఇతర ఫొటోలతో పాటు జిల్లాల్లో లుక్అవుట్ నోటీసులు అంటించగా వాటిని చూసిన మృతురాలి బంధువులు పోలీసులను ఆశ్రయిస్తేనే హత్య కేసు నిందితుడిని పట్టుకోగలిగారు.

ఓఆర్ఆర్ సమీపంలో జరిగిన హత్యతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. నిర్మానుశ్యంగా, రాత్రి వేళల్లో వీధి లైట్లు, సీసీ కెమెరాలు లేకపోవడంతోనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. సర్వీస్ రోడ్డు పక్కనే కంపెనీలు, వ్యాపార సముదాయాల వారు సైతం కెమెరాలు ఏర్పాటు చేసుకునేలా పోలీసులు చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం, HMDA ఇప్పటికైనా స్పందించి సర్వీస్ రోడ్డులో విద్యుత్ దీపాలు, కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తే హత్యాచారాలు వంటి ఘటనలు జరగకుండా ఉంటాయి.

Tags:    

Similar News