Amit Shah: నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Amit Shah: సా.6 గంటలకు చేవెళ్లలో అమిత్‌షా బహిరంగసభ
నేడు తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా
Amit Shah: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బీజేపీ జాతీయ నాయకత్వం దూకుడు పెంచింది. ఇవాళ చేవెళ్లలో నిర్వహిస్తున్న విజయ సంకల్ప సభకి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. పార్లమెంటరీ ప్రవాసి యోజన కార్యక్రమంలో భాగంగా అమిత్ షా చేవెళ్ల పార్లమెంట్ సభలో పాల్గొననున్నారు. కర్ణాటక ఎన్నికల తర్వాత పూర్తిస్థాయిలో బీజేపీ నాయకత్వం తెలంగాణపై దృష్టి సారించింది. చేవెళ్లల్లో బీజేపీ నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు వేగంగా సాగుతున్నాయి. దాదాపు లక్ష మంది ఈ మీటింగ్‌కు వస్తారని కాషాయ శ్రేణులు అంచనా వేస్తున్నారు.
దాదాపు నాలుగున్నర గంటల పాటు హైదరాబాద్‌లో గడపనున్నారు అమిత్ షా. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ నుంచి స్పెషల్ ఫ్లైట్‌లో శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటారు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ట్రిపుల్ ఆర్ టీంతో షా సమావేశం కానున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన 6 గంటలకు నేరుగా చేవెళ్లకు చేరుకుంటారు. ముఖ్యంగా కేంద్ర పథకాలు, రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, తాజా రాజకీయాలపై అమిత్ షా ప్రసంగించే అవకాశముంది. రాత్రి 7 గంటలకు సభ ముగించుకొని.. రోడ్డు మార్గం ద్వారా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 7 గంటల 50 నిమిషాలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి పయనమవుతారు.
పార్లమెంటరీ ప్రవాస్ యోజన ప్రోగ్రాంలో భాగంగా రాష్ట్రంలో జరుగుతున్న మొదటి బహిరంగ సభ ఇదే కావడంతో రాష్ట్ర బీజేపీ నేతలు ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొన్నారు. మూడు రోజులుగా సభ ఏర్పాట్లలో రాష్ట్ర నేతలు మునిగారు. ఏర్పాట్లను పరిశీలించిన బండి సంజయ్... జన సమీకరణపై పార్టీ నేతలతో చర్చించారు. కనీసం లక్ష మందిని సభకు తరలించడమే లక్ష్యంగా పార్టీ నాయకులు శ్రమిస్తున్నారు. హైదరాబాద్ సిటీకి వేదిక దగ్గరగా ఉండడం, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో జరుగనుండడంతో పెద్ద సంఖ్యలో జనాన్ని తరలించడంపై పార్టీ నేతలు దృష్టి పెట్టారు.