ఇవాళ తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
Amit Shah: నేడు ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి.. ఖమ్మం సభ ప్రాంగణానికి చేరుకోనున్న అమిత్ షా
ఇవాళ తెలంగాణకు కేంద్ర హోంమంత్రి అమిత్‌షా
Amit Shah: ఇవాళ తెలంగాణలో కేంద్రమంత్రి అమిత్ షా పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఖమ్మంలో తెలంగాణ బీజేపీ బహిరంగ సభ జరగనుంది. నేడు ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి అమిత్ షా నేరుగా ఖమ్మం సభ ప్రాంగణానికి అమిత్ షా చేరుకోనున్నారు. సభా ప్రాంగణంలో ముఖ్య నేతలతో అమిత్‌షా భేటీ కానున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల వ్యూహం పై పార్టీ నేతలతో చర్చించనున్నారు. బీజేపీ బహిరంగ సభ నుంచే అసెంబ్లీ ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. అధికార బీఆర్‌ఎస్ టార్గెట్‌గా మరోసారి స్పీచ్ ఉంటుందని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బలం లేదని ఆరోపణలు చేసిన కాంగ్రెస్ , బీఆర్‌ఎస్‌కు ఖమ్మం నుండి సవాల్ విసరడానికి కమలం పార్టీ రెడీ అవుతోంది.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరనున్నారు బీజేపీ అగ్రనేత అమిత్ షా. మధ్యాహ్నం 2 గంటల 50 నిమిషాలకు ఏపీలోని గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకోనున్నారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు. 3 గంటల 45 నిమిషాలకు సభా వేదికకు చేరుకుంటారు అమిత్ షా. 4 గంటల 45 నిమిషాలకు సభ ముగియనుంది. బహిరంగ సభ పూర్తయిన అనంతరం అదే సభావేదికపై ఏర్పాటు చేసిన పార్టీ కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. కోర్ కమిటీ మీటింగ్ 5 గంటల 30 నిమిషాల వరకు సాగుతుంది. మీటింగ్ ముగిసిన తర్వాత 6 గంటల 20 నిమిషాలకు తిరిగి గన్నవరం ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు.
మరో వైపు బహిరంగ సభను సక్సెస్ చేసేందుకు రాష్ట్ర నాయకత్వం భారీ ఏర్పాట్లు చేసింది. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి సభకు కనీసం లక్ష మందిని తరలించేలా ప్రణాళికలు వేస్తోంది. రైతులకు భరోసా ఇచ్చేలా అమిత్ షా సభ ఉంటుందని బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే రైతుల కోసం తాము అమలు చేయనున్న పథకాలను అమిత్ షా ప్రకటిస్తారంటున్నారు బీజేపీ నేతలు.