Allu Arjun Case: Interim Bail అంటే ఏమిటి?

Update: 2024-12-13 13:14 GMT

What is Interim Bail: అల్లు అర్జున్‌కు తెలంగాణ హైకోర్టు ఇంటరిమ్ బెయిల్ మంజూరు చేసింది. సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన కేసులో అరెస్ట్ అయిన పుష్ప హీరో అల్లు అర్జున్‌కు ఈ బెయిల్ రాకపోయి ఉంటే ఆయన చంచల్ గూడ జైలుకు వెళ్ళాల్సి వచ్చేది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా జరిగిపోయాయి.

చివరకు శుక్రవారం సాయంత్రానికి తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్‌కు నాలుగు వారాల తాత్కాలిక బెయిల్ మంజూరు చేయడంతో ఆయనకు రిలీఫ్ దొరికింది. ఈ కేసును కొట్టేయాలంటూ అర్జున్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ, సినీ నటుడు అయినంత మాత్రాన సామాన్య పౌరుడికి వర్తించే మినహాయింపులు లేకుండా పోవని కూడా వ్యాఖ్యానించింది.

ఇంతకీ ఇంటరిమ్ బెయిల్ అంటే ఏంటి?

విచారించదగిన కేసులో చిక్కుకున్న ఒక వ్యక్తికి స్వల్ప కాలం కోసం ఇచ్చే బెయిల్‌ను ఇంటరిమ్ బెయిల్ అంటారు. దీన్నే తాత్కాలిక బెయిల్ అంటారు. దీన్నే మీడియాలో మధ్యంతర బెయిల్ అని వ్యవహరిస్తున్నారు.

ఇది కోర్టు విచారణను లేదా రిమాండ్‌తో జైలుకు వెళ్ళాల్సిన ముద్దాయికి తాత్కాలికంగా రిలీఫ్ ఇస్తుంది. అయితే, ఈ బెయిల్ గడువు ముగిసేలోగా ఆ ముద్దాయి పూర్తి స్థాయి బెయిల్ లేదా యాంటిసిపేటరీ బెయిల్ పొందాల్సి ఉంటుంది.

ఇంటరిమ్ బెయిల్ గడువును పొడిగించే అధికారం కూడా కోర్టుకు ఉంటుంది. రెగ్యులర్ లేదా యాంటిసిపేటరీ బెయిల్‌కు ముద్దాయి దరఖాస్తు చేసుకుని ఉన్నట్లయితే, ఆ విచారణ ఇంకా కొనసాగుతున్నట్లయితే హైకోర్టు ఇంటరిమ్ బెయిల్ గడువును పెంచుతూ నిర్ణయం తీసుకోవచ్చు. నిందితుడు కోర్టుకు విచారణకు దొరక్కుండా పారిపోయే అవకాశాలు ఏమీ లేవని భావించినప్పుడు కోర్టు ఇంటరిమ్ బెయిల్ మంజూరు చేస్తుంది.

అలాగే, కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను సదరు నిందితుడు మార్చడం లేదా ధ్వంసం చేయడం వంటి పనులకు పాల్పడే అవకాశం లేదని కోర్టు భావించినప్పుడు మాత్రమే ఈ బెయల్ వస్తుంది.

మరీ ముఖ్యంగా, కస్టడీలో ఉంచి విచారించాల్సిన అవసరం ఏమాత్రం లేదని కోర్టు విశ్వసించినప్పుడు ఇంటరిమ్ బెయిల్ ఇవ్వవచ్చని గత తీర్పులు సూచిస్తున్నాయి. ఇంటరిమ్ బెయిల్ తెచ్చుకోవడానికి ఆరోగ్య కారణాలు కూడా చూపించవచ్చు. నిందితుడికి అత్యవసర లేదా ప్రత్యేకమైన వైద్య సేవలు అవసరమని కోర్టు భావించినప్పుడు కూడా ఇంటరిమ్ బెయిల్ వస్తుంది. కుటుంబ బాధ్యతలు, వయసు, కుటుంబ సభ్యుల ఆరోగ్యం వంటి కారణాలతో కూడా నిందితులు ఇంటరిమ్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కొన్ని కేసుల్లో నిందితుడు పూర్తిగా సహకరించినా కూడా విచారణ ఆలస్యం అవుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా నిందితుడు ఇంటరిమ్ బెయిల్ పొందే అవకాశం ఉంటుంది.

Tags:    

Similar News