Telangana: లోన్ కట్టాలని వేధింపులు.. బ్యాంకులోనే పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య
Telangana: ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. బ్యాంకు సిబ్బంది వేధింపులకు ఓ రైతు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అప్పు తీసుకున్న బ్యాంకులోనే అందరు చూస్తుండగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే ఆదిలాబాద్ జిల్లా బేల మండలం రేణిగూడకు చెందిన రైతు ఆదిలాబాద్ ఐసీఐసీఐ బ్యాంకులో భూమిని కుదవ పెట్టి 3.50లక్షల లోన్ తీసుకున్నాడు.
ఏడాదికి కొంత వడ్డీని కడుతున్నాడు. గతేడాది కాలంగా పంటలు సరిగ్గా పండక వడ్డీ కట్టలేదు. వడ్డీని చెల్లించలేని లేని పక్షంలో భూమిని జప్తు చేసుకుంటామంటూ బ్యాంకు అధికారులు తేల్చి చెప్పారు. దీంతో తనకు ఇన్నేళ్లు అన్నం పెట్టిన భూమి పోతుందన్న మనోవేదనకు గురైన రైతు దేవరరావు పురుగుల మందు డబ్బాతో బ్యాంకుకు వచ్చి అందరి ముందే తాగేందుకు యత్నించాడు.
అది గమనించిన సెక్యూరిటీ గార్డు రైతును పక్కన ఉన్న కుర్చిలో కూర్చోబెట్టి బ్యాంకు అధికారులకు సమాచారం అందించాడు. అంతలోనే రైతు తీవ్ర అస్వస్థతకు గురై అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు బ్యాంకులోని సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. సమాచారం అందుకున్ను పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. వేలకోట్లలో బ్యాంకులకు రుణాలు ఎగగొట్టి ఎంజాయ్ చేస్తున్న బడాబాబులను ఏం చేయలేని అధికారులు ఇలా చిన్న, సన్నకారు రైతులను వేధింపులకు గురిచేయడంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.