ఖమ్మంలో కరోనా డేంజర్ బెల్స్...లక్షణాలు లేకుండానే...

రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. బతుకు దెరువు కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.

Update: 2020-05-27 10:44 GMT

రాష్ట్రంలో కరోనా డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. బతుకు దెరువు కోసం ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లిన కార్మికులు స్వగ్రామాలకు చేరుకుంటున్నారు.దీంతో కరోనా కేసుల సంఖ్య మరింత పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర నుంచి ఖమ్మం జిల్లాకు వచ్చిన వారిలో ఏడుగురికి కరోనా పాజిటివ్ వచ్చింది. వారిలో మధిర మండలం మహదేవపురానికి చెందిన ఒకరు, పెనుబల్లి మండలం వీఎం బంజరకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్ రావడంతో ఆ ప్రాంతమంతా కలకలం రేపుతోంది.

పూర్తివివరాల్లోకెళితే మహారాష్ట్ర నుంచి ఓ అద్దెబస్సును మాట్లాడుకుని మహబూబాబాద్‌ జిల్లాకు చెందిన ఇద్దరు వ్యక్తులు, ఖమ్మం జిల్లాకు చెందిన ఏడుగురు, హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి తమ సొంత గ్రామాలకు చేరుకున్నారు. కాగా అధికారులు అప్రమత్తమై మహారాష్ట్ర నుంచి వచ్చిన వారినందరినీ క్వారంటైన్ చేసారు. కాగా వారిలో ఖమ్మం జిల్లాకు చేరుకున్న వారిలో ఓ మహిళకు వైద్య పరీక్షలు చేసారు. ఆ వైద్య పరీక్షల్లో ఆమెకు కరోనా వచ్చినట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో అధికారులు ఆమెతో పాటు క్వారంటైన్‌లో ఉంచిన మిగిలిన ఆరుగురిని కూడా ఈనెల 23న ఖమ్మంలోని క్వారంటైన్‌ కేంద్రానికి తరలించారు. ఆ తరువాత మహారాష్ట్ర నుంచి వచ్చిన వారిలో 40 ఏళ్ల వయసున్న మరో వ్యక్తికి పాజిటివ్‌ రిపోర్టు వచ్చినట్టు జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు.

అంతే కాక ఆ బస్సులో వచ్చిన వీఎం బంజరకు చెందిన మరో వ్యక్తికి కూడా పాజిటివ్‌‌గా నిర్ధారణ అయినట్లుగా అధికారులు చెప్పారు. దీంతో ప్రస్తుతం ఖమ్మంలో మరో సారి కరోనా డేంజర్ బెల్స్ మోగడం మొదలయ్యాయి. అయితే ఈ కరోనా పాజిటివ్ వచ్చిన వారిలో ఎవరికీ కూడా లక్షణాలు లేకపోడం గమనార్హం. అయితే మంగళవారం కూడా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి కూడా లక్షణాలు లేకుండానే పాజిటివ్‌ రిపోర్టు వచ్చింది. ఈ కేసుతో ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో కరోనా కేసుల సంఖ్య 11కు చేరింది.

Tags:    

Similar News