పుస్తక ప్రియులతో సందడిగా మారిన జాతియ పుస్తక ప్రదర్శన

అభిరుచులకు, విభిన్న ఆలోచనలకు కూడలి హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం. ఆధ్యాత్మిక రచనలతో

Update: 2019-12-29 15:57 GMT
National Book fair

అభిరుచులకు, విభిన్న ఆలోచనలకు కూడలి హైదరాబాద్‌ జాతీయ పుస్తక మహోత్సవం. ఆధ్యాత్మిక రచనలతో మానసిక ఉపశమనం పొందాలనుకునే పెద్దలు, బొమ్మల కథలతో ఆనందాన్ని ఆస్వాదించే చిన్నారులు కథ, నవలా సాహిత్యంతో తన్మయత్వాన్ని పొందే యువత, నిత్యజీవిత ఒడిదుడుకులకు విరుగుడుగా అక్షరాల చెట్టునీడలో సేదతీరే మధ్య వయస్కులు, వర్తమానంపై ప్రేమున్నోళ్లు, భవిష్యత్తుపై ఆశవున్నోళ్లు ,చరిత్రపై మమకారంగల వారందరికీ ఒకే చోటు అదే బుక్‌ఫెయిర్‌.

హైదరాబాద్‌ ఎన్టీఆర్‌ స్టేడియంలోని కళాభారతి ప్రాంగణంలో 33వ జాతీయ పుస్తక ప్రదర్శన ప్రారంభమైంది. జనవరి 1వ తేదీ వరకు పుస్తకాల జాతర కొనసాగనుంది. మొత్తం 330 స్టాళ్లు ఏర్పాటు చేశారు. అన్ని భాషల పుస్తకాల స్టాళ్లు ఉన్నాయి.ఇక పిల్లలను పుస్తకాలు చదివించేలా బాల మేళాను ప్రముఖంగా నిర్వహిస్తున్నారు. పిల్లలకు, ఐడీ కార్డుతో వచ్చిన విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నారు. 100 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాలల విద్యార్థులు కూడా పుస్తక మహోత్సవానికి తరలి వస్తున్నారు.

హైదరాబాద్‌ బుక్‌ఫెయిర్‌కు పుస్తక ప్రియులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాహితీ సభలు, పుస్తకావిష్కరణలు, సాంస్కృతిక కార్యక్రమాలతో బుక్‌ఫెయిర్‌ సందడిగా మారింది. సాహిత్యం, చరిత్ర, ఆర్థిక అంశాలకు సంబంధించిన అనేక అంశాలపైన పాఠకులు తమకు నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు.

మరోవైపు బాలమేళ కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్లల మేజిక్‌ వంటి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నవలలు, రచనలు, సాహిత్యాలు, నైతిక విలువలకు సంబంధించిన పుస్తకాలతో పాటు, ఉద్యోగాలకు ప్రిపేర్ కావడం కోసం కాంపిటేటివ్ బుక్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

వేదాలను ఈ తరానికి పరిచయం చేయడానికి వేదాలసారం అనే బుక్‌ను రూపొందించినట్లు పుస్తక రచయిత తెలిపారు. ప్రదర్శనలో 5 భాషలకు చెందిన పుస్తకాలు కొలువుదీరాయి. సాహితీవేత్తలు, కవులు, రచయితలు, కళా పిపాసులకు పుస్తక పండగే.

33 వ జాతీయ పుస్తక ప్రదర్శనలో గతంలో కంటే అధిక సంఖ్యలో సందర్శకులు వస్తున్నారు. మొత్తం 330 స్టాళ్ళలో వేలాది పుస్తకాలు అందుబాటులోకి వచ్చాయి. జనవరి 1వ తేదీ వరకు ఉండే పుస్తక ప్రదర్శనను ప్రతి ఒక్కరు సందర్శించాల్సిందే..

Tags:    

Similar News