Virat Kohli : అన్ని అవార్డులు అమ్మకే.. వడోదర వన్డే విజయం తర్వాత విరాట్ ఎమోషనల్ కామెంట్స్
Virat Kohli : క్రికెట్ మైదానంలో అడుగుపెడితే రికార్డులు తిరగరాయడం విరాట్ కోహ్లీకి అలవాటుగా మారిపోయింది.
Virat Kohli : అన్ని అవార్డులు అమ్మకే.. వడోదర వన్డే విజయం తర్వాత విరాట్ ఎమోషనల్ కామెంట్స్
Virat Kohli : క్రికెట్ మైదానంలో అడుగుపెడితే రికార్డులు తిరగరాయడం విరాట్ కోహ్లీకి అలవాటుగా మారిపోయింది. వడోదరలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి వన్డేలో కోహ్లీ (93 పరుగులు) మరోసారి తన బ్యాట్‌తో మ్యాజిక్ చేశాడు. భారత్‌కు విజయాన్ని అందించడమే కాకుండా, తన కెరీర్‌లో 71వ సారి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు. అయితే, ఇన్ని అవార్డులను కోహ్లీ ఎక్కడ దాచుకుంటాడు? అసలు వాటిని ఏం చేస్తాడు? అనే ప్రశ్నకు విరాట్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు కోట్లాది మంది అభిమానుల మనసు గెలుచుకుంటోంది.
మ్యాచ్ ముగిసిన తర్వాత జరిగిన ప్రజెంటేషన్ సెర్మనీలో కోహ్లీకి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురైంది. "నీ దగ్గర ఎన్ని ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డులు ఉన్నాయో నీకు తెలుసా?" అని అడగ్గా.. కోహ్లీ చాలా వినమ్రంగా సమాధానం ఇచ్చాడు. "నిజం చెప్పాలంటే నా దగ్గర ఎన్ని అవార్డులు ఉన్నాయో నాకు తెలియదు. నాకు ఏ అవార్డు వచ్చినా వెంటనే మా అమ్మకు పంపించేస్తాను. ఆమెకు ఆ అవార్డులను భద్రపరుచుకోవడం అంటే చాలా ఇష్టం. నా విజయాలను చూసి ఆమె ఎంతో గర్వపడుతుంది" అని కోహ్లీ తన అమ్మపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు.
ఈ మ్యాచ్‌లో 93 పరుగులు చేసిన క్రమంలో కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యంత వేగంగా 28,000 పరుగులు పూర్తి చేసిన బ్యాటర్‌గా సరికొత్త ప్రపంచ రికార్డు సృష్టించాడు. కేవలం 624 ఇన్నింగ్స్‌ల్లోనే ఈ మైలురాయిని చేరుకుని సచిన్ టెండూల్కర్ (644 ఇన్నింగ్స్), కుమార సంగక్కర (666 ఇన్నింగ్స్) రికార్డులను చెరిపివేశాడు. అంతేకాదు, అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా కుమార సంగక్కర (28,016)ను వెనక్కి నెట్టి కోహ్లీ (28,068) చరిత్ర సృష్టించాడు. ఇప్పుడు కోహ్లీ కంటే ముందు కేవలం సచిన్ టెండూల్కర్ (34,357) మాత్రమే ఉన్నాడు.
తన సక్సెస్ జర్నీ గురించి కోహ్లీ మాట్లాడుతూ.. "వెనక్కి తిరిగి చూసుకుంటే ఇదంతా ఒక కలలా అనిపిస్తుంది. నా సామర్థ్యం మీద నాకు ఎప్పుడూ నమ్మకం ఉండేది. ఈ రోజు నేను ఈ స్థితిలో ఉన్నానంటే దానికి కారణం నా కష్టమే. దేవుడు నాకు చాలా ఇచ్చాడు, అందుకు నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. నేను రికార్డుల గురించి ఆలోచించను, జట్టుకు విజయాన్ని అందించడమే నా లక్ష్యం. అనుభవం అనేది ఆటలో చాలా ముఖ్యం" అని విరాట్ ఎమోషనల్ అయ్యాడు. 85వ అంతర్జాతీయ సెంచరీకి కేవలం 7 పరుగుల దూరంలో అవుట్ అయినప్పటికీ, జట్టు విజయంలో కీలక పాత్ర పోషించినందుకు కోహ్లీ సంతృప్తి వ్యక్తం చేశాడు.