Vaibhav Suryavanshi : వైభవ్ విధ్వంసం..స్టేడియం బయట పడ్డ బంతి..14 ఏళ్ల కుర్రాడి సిక్సర్‌కు కామెంట్లేటర్లు షాక్
సౌతాఫ్రికా గడ్డపై భారత 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ సృష్టించాడు.
Vaibhav Suryavanshi : వైభవ్ విధ్వంసం..స్టేడియం బయట పడ్డ బంతి..14 ఏళ్ల కుర్రాడి సిక్సర్‌కు కామెంట్లేటర్లు షాక్
Vaibhav Suryavanshi : సౌతాఫ్రికా గడ్డపై భారత 14 ఏళ్ల సంచలనం వైభవ్ సూర్యవంశీ సిక్సర్ల సునామీ సృష్టించాడు. అండర్-19 వరల్డ్ కప్‌కు ముందు జరుగుతున్న వన్డే సిరీస్‌లో భాగంగా సోమవారం జరిగిన రెండో మ్యాచ్‌లో ఈ కుర్రాడు ఆడిన ఇన్నింగ్స్ చూసి ప్రపంచ క్రికెట్ దిగ్గజాలు సైతం నోరెళ్లబెడుతున్నారు. కేవలం తన బ్యాటింగ్‌తోనే కాకుండా, మైదానం వెలుపల పడేలా అతను బాదిన ఒక భారీ సిక్సర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
బెనోనీలోని విలోమూర్ పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో సౌతాఫ్రికా నిర్దేశించిన 246 పరుగుల లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగింది. ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఐదో బంతికే వైభవ్ తన విశ్వరూపం చూపించాడు. లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ వేసిన షార్ట్ పిచ్ బంతిని అద్భుతమైన హుక్ షాట్‌తో లాంగ్ లెగ్ బాండరీ అవతలికి పంపాడు. ఆ బంతి గాల్లో ప్రయాణించి ప్రేక్షకుల గ్యాలరీని దాటి స్టేడియం బయట పడింది. దీనిపై కామెంట్లేటర్ స్పందిస్తూ.. "ఈ మైదానంలో ఎంతోమంది అంతర్జాతీయ స్టార్లు ఆడటం చూశాను, కానీ ఇంత పెద్ద సిక్సర్‌ను మాత్రం ఇప్పుడే చూస్తున్నాను. ఇది అన్ బిలీవబుల్ షాట్" అని ప్రశంసల వర్షం కురిపించారు.
వైభవ్ కేవలం ఆ ఒక్క షాట్‌తోనే ఆగలేదు. విధ్వంసకర బ్యాటింగ్‌తో కేవలం 19 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మొత్తం 24 బంతులు ఎదుర్కొన్న భారత కెప్టెన్.. ఏకంగా 10 సిక్సర్లు, ఒక ఫోర్‌తో 68 పరుగులు సాధించాడు. అంటే అతను చేసిన మొత్తం పరుగుల్లో 64 పరుగులు కేవలం బౌండరీల (సిక్సర్లు, ఫోర్లు) ద్వారానే రావడం విశేషం. వైభవ్ ఇచ్చిన ఈ మెరుపు ఆరంభంతో భారత్ కేవలం 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
వైభవ్ మెరుపు ఇన్నింగ్స్‌కు తోడు భారత బౌలర్లు కూడా రాణించడంతో సౌతాఫ్రికాను 245 పరుగులకే కట్టడి చేశారు. ఈ అద్భుత విజయంతో మూడు వన్డేల సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. కేవలం 14 ఏళ్ల ప్రాయంలోనే టీమిండియా అండర్-19 జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తూ, ఇలాంటి వీరోచిత ఇన్నింగ్స్‌లు ఆడుతున్న వైభవ్ సూర్యవంశీని చూస్తుంటే.. భారత్‌కు మరో వీరేంద్ర సెహ్వాగ్ దొరికాడని ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.