U19 World Cup : బంగ్లాదేశ్ ఆటగాళ్ల అత్యుత్సాహం..భారత కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వరా?
U19 World Cup : అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం పరంగా భారత్‌కు ఆనందాన్నిచ్చినా, మైదానంలో జరిగిన ఒక సంఘటన మాత్రం పెను వివాదానికి దారితీసింది.
U19 World Cup : బంగ్లాదేశ్ ఆటగాళ్ల అత్యుత్సాహం..భారత కెప్టెన్‌కు షేక్ హ్యాండ్ ఇవ్వరా?
U19 World Cup: అండర్-19 వరల్డ్ కప్ 2026లో భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఫలితం పరంగా భారత్‌కు ఆనందాన్నిచ్చినా, మైదానంలో జరిగిన ఒక సంఘటన మాత్రం పెను వివాదానికి దారితీసింది. టాస్ సమయంలో భారత కెప్టెన్‌కు బంగ్లాదేశ్ ఆటగాడు షేక్ హ్యాండ్ ఇవ్వకపోవడం సోషల్ మీడియాలో చర్చనీయాంశమైంది. క్రీడా స్ఫూర్తికి విరుద్ధంగా బంగ్లాదేశ్ ప్రవర్తించిందంటూ విమర్శలు రావడంతో, చివరకు బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు రంగంలోకి దిగి వివరణ ఇచ్చుకోవాల్సి వచ్చింది.
జింబాబ్వే, నమీబియా వేదికలుగా జరుగుతున్న అండర్-19 ప్రపంచకప్‌లో భారత్ తన తొలి మ్యాచ్‌ను బంగ్లాదేశ్‌తో ఆడింది. మ్యాచ్ ప్రారంభానికి ముందు టాస్ వేసే సమయంలో అసలు వివాదం మొదలైంది. భారత్ తరపున కెప్టెన్ ఆయుష్ మ్హత్రే టాస్‌కు రాగా, బంగ్లాదేశ్ రెగ్యులర్ కెప్టెన్ అజీజుల్ హకీమ్ అనారోగ్యం కారణంగా రాలేదు. అతని స్థానంలో వైస్ కెప్టెన్ జవాద్ అబ్రార్ టాస్‌కు వచ్చాడు. టాస్ ప్రక్రియ ముగిసిన తర్వాత ఇద్దరు కెప్టెన్లు కరచాలనం చేసుకోవడం ఆనవాయితీ. కానీ, అబ్రార్ భారత కెప్టెన్‌కు కనీసం షేక్ హ్యాండ్ ఇవ్వకుండానే అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఈ దృశ్యాలు టీవీల్లో స్పష్టంగా కనిపించడంతో భారత అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వివాదం ముదరడంతో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు అధికారిక ప్రకటన విడుదల చేసింది. టాస్ సమయంలో జరిగిన సంఘటన పూర్తిగా అనాలోచితంగా జరిగిందని, భారత కెప్టెన్‌ను అవమానించాలనే ఉద్దేశం తమకు లేదని బీసీబీ పేర్కొంది. "ఆ సమయంలో ఆటగాడి దృష్టి మ్యాచ్‌పై ఉండటం వల్ల పొరపాటున చేయి కలపడం మర్చిపోయాడు. అంతే తప్ప ఇందులో ఎలాంటి కుట్ర లేదు. క్రీడా స్ఫూర్తిని కాపాడటం మా మొదటి ప్రాధాన్యత" అని బోర్డు తెలిపింది. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా తమ ఆటగాళ్లకు కఠిన ఆదేశాలు జారీ చేసినట్లు వెల్లడించింది.
మైదానంలో బంగ్లాదేశ్ ఎంత వింతగా ప్రవర్తించినా, ఆటలో మాత్రం భారత కుర్రాళ్లు వారిని చిత్తు చేశారు. ముఖ్యంగా యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ బాది రికార్డు సృష్టించాడు. కేవలం కొద్ది బంతుల్లోనే తన మార్క్ షాట్లతో బంగ్లా బౌలర్లను ఉతికేసిన వైభవ్, విరాట్ కోహ్లీ వంటి దిగ్గజాల రికార్డులను కూడా పక్కకు నెట్టేశాడు. వర్షం కారణంగా డక్ వర్త్ లూయిస్ పద్ధతిలో భారత్ 18 పరుగుల తేడాతో విజయం సాధించి, టోర్నీలో బోణీ కొట్టింది.
టాస్ సమయంలో వివాదం రేగినప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత మాత్రం రెండు జట్ల ఆటగాళ్లు ఒకరినొకరు అభినందించుకున్నారు. మైదానంలో గొడవలు పడినా, ఆట ముగిశాక షేక్ హ్యాండ్స్ ఇచ్చుకోవడం ద్వారా అసలైన స్పోర్ట్స్ మ్యాన్ షిప్ ప్రదర్శించారు. ఏది ఏమైనా, బంగ్లాదేశ్ ఆటగాళ్లు గతంలోనూ భారత్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో ఇలాగే ప్రవర్తించిన సందర్భాలు ఉన్నాయి. అందుకే ఈసారి బీసీబీ ముందుగానే జాగ్రత్త పడి తన ఆటగాళ్లను కంట్రోల్‌లో ఉంచే ప్రయత్నం చేస్తోంది.