Tokyo Olympics: ప్రేక్షకులు లేకుండానే టోక్యో ఒలింపిక్స్

Tokyo Olympics: టోక్యో సహా ఇతర నగరాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో జపాన్ ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకుంది.

Update: 2021-07-09 02:43 GMT

Tokyo Olympics to be held without spectators

Tokyo Olympics: మరో రెండు వారాల్లో టోక్యో వేదికగా అంతర్జాతీయ క్రీడా సంబరాలు ప్రారంభం కానున్నాయి. టోక్యో సహా ఇతర నగరాల్లో కరోనా కేసులు భారీగా పెరిగిపోతుండటంతో అక్కడి ప్రభుత్వం కఠిన నిర్ణయం తీసుకున్నది. ''డెల్టా వేరియంట్ వ్యాప్తిని అరికట్టేందుకు వైరస్‌ నివారణ చర్యలు మరింత వేగం చేయాలి. అభిమానులు లేకుండానే ఒలింపిక్స్‌ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకున్నాం'' అని జపాన్ ప్రధాని యొషిహిదే సుగా ప్రకటించారు. ఈనెల 12 నుంచి 22 వరకు దేశవ్యాప్తంగా ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు ప్రకటించింది. కరోనా నేపథ్యంలో జపాన్‌లో ఎమర్జెన్సీ విధించడం ఇది నాలుగో సారి. జులై 23 నుంచి ఆగస్టు 8 వరకు జరిగే ఒలింపిక్స్‌ పూర్తిగా ఎమర్జెన్సీ పరిస్థితుల మధ్యనే జరుగుతాయని తెలిపారు. అలాగే ఆగస్టు 24న పారా ఒలింపిక్స్‌ మొదలుకానున్నాయి. ఎమర్జెన్సీ సమయంలో జపాన్‌లో బార్లు, రెస్టారెంట్లలో మద్యం అమ్మకాలపై నిషేధం కొనసాగుతుందన్నారు.

ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్స్ నిర్వహించనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈమేరకు టీవీల్లోనే ఒలింపిక్స్ చూడాలని కోరింది. మొన్నటి వరకు కూడా రోజుకు 10,000 మందిని స్టేడియాలకు అనుమతిస్తామని చెప్పిన ప్రభుత్వం.. గత నెల రోజులుగా అక్కడ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో.. ప్రేక్షకులు లేకుండానే నిర్వహించేందుకు జపాన్ ప్రభుత్వం మొగ్గుచూపింది. కాగా, గురువారం టోక్యోలో 896 కొత్త కేసులు నమోదయ్యాయి. అలాగే ఒలింపిక్ విలేజ్ లోనూ రెండు కరోనా కేసులు నమోదయ్యాయి. గురువారం అంతర్జాతీయ ఒలింపిక్‌ కమిటీ (ఐఓసీ) అధ్యక్షుడు థామస్‌ బాక్‌ టోక్యో చేరుకున్నాడు. విమానాశ్రయం నుంచి నేరుగా ఐఓసీ క్రీడల సెంట్రల్ ఆఫీస్‌కు చేరుకున్నాడు. మూడు రోజుల పాటు ఆయన ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు తెలుస్తోంది.

మరోవైపు టోక్యో ఒలింపిక్స్ కోసం భారత్ నుంచి దాదాపు 117 మంది అథ్లెట్లు పాల్గొనబోతున్నారు. అయితే, ఇప్పటికే వీరి పేర్లను భారత ఒలింపిక్స్ సంఘం ప్రకటించిన సంగతి తెలిసిందే. వీరి ఎప్పుడు జపాన్ బయలుదేరేది మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ విషయంలో అథ్లెట్లు కు కూడా సమాచారం లేదు. మూడు రోజుల క్రితం ఐఓఏ ప్రెసిడెంట్ నరీందర్ బాత్రా వెల్లడించిన వివరాల మేరకు.. అథ్లెట్ల ఫస్ట్ బ్యాచ్ 17న టోక్యో బయలుదేరుతుందని తెలిపారు. కానీ, టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ నుంచి క్లియరెన్స్ ఇంకా రాలేదని, అది ఓకే అయితే 14 నే బయలు దేరనున్నట్లు అథ్లెట్లకు సమచారం అందింది.

ఆటగాళ్లు, సిబ్బంది, ఇతర అధికారులు తప్పకుండా కరోనా నిబంధనలు పాటించాలని సూచించింది. ఎవరైనా రూల్ బుక్ నియమాలను అతిక్రమిస్తే క్రీడల నుంచే కాకుండా జపాన్ నుంచి బహిష్కరిస్తామని హెచ్చరించింది. గతంలో మూడు సార్లు జపాన్ ప్రభుత్వం ప్రధాన నగరాల్లో ఎమర్జెన్సీ విధించింది.

Tags:    

Similar News