T20 World Cup 2026: కఠిన చర్యలు తప్పవు.. పాకిస్థాన్‌కు ఐసీసీ హెచ్చరిక!

T20 World Cup 2026: టీ20 వరల్డ్‌కప్‌ 2026లో గ్రూప్‌ స్టేజిలో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను పాకిస్థాన్‌ బహిష్కరించింది.

Update: 2026-02-02 05:56 GMT

T20 World Cup 2026: కఠిన చర్యలు తప్పవు.. పాకిస్థాన్‌కు ఐసీసీ హెచ్చరిక!

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో గ్రూప్‌ స్టేజిలో భారత్‌తో జరగనున్న మ్యాచ్‌ను పాకిస్థాన్‌ బహిష్కరించింది. ఈ విషయాన్ని పాకిస్థాన్ తన ఎక్స్‌లో వెల్లడించింది. టీ20 వరల్డ్‌కప్‌లో ఆడేందుకు పాకిస్థాన్‌ క్రికెట్‌ జట్టుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కానీ ఫిబ్రవరి 15న టీమిండియాతో మ్యాచ్‌లో మాత్రం పాక్‌ ఆడదని ఆ దేశ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే భారత్‌తో మ్యాచ్‌ను బహిష్కరించడానికి కారణాన్ని మాత్రం పాకిస్థాన్ చెప్పలేదు. పాకిస్థాన్‌ ప్రభుత్వ నిర్ణయంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ చర్య ప్రపంచ క్రీడా నియమాలకు విరుద్ధమని పేర్కొంది.

2026 టీ20 వరల్డ్‌కప్ టోర్నమెంట్ విషయంలో ఎలాంటి గందరగోళానికి తావు లేదని పీసీబీకి ఐసీసీ స్పష్టం చేసింది. టోర్నీలో ఒక్క మ్యాచ్‌ను బహిష్కరించడం అనుమతించబోదని, అలా చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పీసీబీకి తేల్చి చెప్పింది. వరల్డ్‌కప్ షెడ్యూల్ ఖరారైన నేపథ్యంలో అన్ని జట్లు పూర్తి టోర్నీని ఆడాల్సిందేనని ఐసీసీ స్పష్టం చేసింది. 'వరల్డ్‌కప్‌లో భాగంగా ఉన్న ప్రతి మ్యాచ్‌ను ఆడటం ప్రతి సభ్య దేశానికి తప్పనిసరి. టోర్నీ మొదలయ్యే ముందు లేదా మధ్యలో ఏ ఒక్క మ్యాచ్‌నైనా బహిష్కరించడం నిబంధనలకు విరుద్ధం' అని ఐసీసీ తన అధికారిక సమాచారంలో పేర్కొంది.

ఈ పరిణామాలతో పీసీబీపై ఒత్తిడి మరింత పెరిగింది. ఒకవేళ ఐసీసీ ఆదేశాలను పాకిస్థాన్ లెక్కచేయకపోతే.. భారీ జరిమానాలు, భవిష్యత్ టోర్నమెంట్లపై నిషేధాలు వంటి కఠిన చర్యలు ఉండే అవకాశముందని క్రికెట్ వర్గాలు చెబుతున్నాయి. మొత్తం మీద వరల్డ్‌కప్‌ను విజయవంతంగా నిర్వహించాలనే లక్ష్యంతో ఐసీసీ ఈసారి ఎలాంటి రాజీకి సిద్ధంగా లేదన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌లకు ఎంతో క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు సరిగా లేని కారణంగా 2012 నుంచి ఐసీసీ టోర్నమెంట్లలో మాత్రమే దాయాది దేశాలు తలపడుతున్నాయి. ఈ రెండు జట్లనూ ఒకే గ్రూపులో కూడా ఐసీసీ ఆడిస్తోంది.

Tags:    

Similar News