T20 World Cup 2026: వరల్డ్ కప్ నుంచి తిలక్ వర్మ అవుట్.. రేసులో ఆ ముగ్గురు స్టార్లు!
టీ20 ప్రపంచకప్ 2026కు ముందు భారత్‌కు షాక్. గాయంతో తిలక్ వర్మ దూరం. అతని స్థానంలో గిల్, అయ్యర్ లేదా పంత్ వచ్చే ఛాన్స్.
పొట్టి ప్రపంచకప్ సమరానికి ముందు టీమిండియాకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. అద్భుత ఫామ్‌లో ఉన్న తెలుగు తేజం తిలక్ వర్మ గాయం కారణంగా ఈ మెగా టోర్నీకి దూరమయ్యాడు. దీంతో అతని స్థానాన్ని భర్తీ చేసే ఆటగాడు ఎవరనేది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
దురదృష్టకరం.. విజయ్ హజారే ట్రోఫీలో గాయం
హైదరాబాద్ తరఫున విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్న సమయంలో తిలక్ వర్మకు తీవ్ర గాయమైంది. వైద్యులు అతనికి శస్త్రచికిత్స నిర్వహించి, కనీసం నాలుగు వారాల పాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. ఫలితంగా న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌తో పాటు ప్రతిష్టాత్మకమైన టీ20 ప్రపంచకప్‌కు తిలక్ దూరం కావాల్సి వచ్చింది. బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉన్నప్పటికీ, అతను కోలుకోవడానికి సమయం పట్టనుండటంతో ప్రత్యామ్నాయాలపై సెలెక్టర్లు దృష్టి పెట్టారు.
తిలక్ వర్మ స్థానంలో రేసులో ఉన్నది వీరే!
తిలక్ స్థానాన్ని భర్తీ చేసేందుకు ప్రధానంగా ముగ్గురు ఆటగాళ్ల పేర్లు వినిపిస్తున్నాయి:
1. శుభ్‌మన్ గిల్: ఓపెనర్‌గా ఫామ్ కోల్పోయి వైస్ కెప్టెన్సీని కూడా పోగొట్టుకున్న గిల్‌కు ఇది మంచి అవకాశం. గిల్ మిడిలార్డర్‌లో కూడా రాణించగలడు. న్యూజిలాండ్‌తో జరిగే వన్డే సిరీస్‌లో గిల్ గనుక సత్తా చాటితే, వరల్డ్ కప్ జట్టులోకి అతని రీ-ఎంట్రీ ఖాయం కావచ్చు.
2. శ్రేయస్ అయ్యర్: ఐపీఎల్ 2025లో పంజాబ్ తరఫున 604 పరుగులు చేసి అదరగొట్టిన అయ్యర్‌కు టీ20 జట్టులో చోటు దక్కలేదు. కానీ ఇప్పుడు తిలక్ దూరం కావడంతో అయ్యర్ పేరును సెలెక్టర్లు పరిశీలిస్తున్నారు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేయగల సామర్థ్యం అతనికి అదనపు బలం.
3. రిషభ్ పంత్: జట్టులో 'లెఫ్ట్-రైట్' కాంబినేషన్ కొనసాగించాలంటే పంత్ ఉత్తమ ఎంపిక. సంజూ శాంసన్ ఇప్పటికే వికెట్ కీపర్‌గా ఉన్నందున, పంత్‌ను స్పెషలిస్ట్ బ్యాటర్‌గా తీసుకునే అవకాశం ఉంది. గత వరల్డ్ కప్ విన్నింగ్ టీమ్‌లో సభ్యుడైన పంత్, తన హిట్టింగ్ పవర్‌తో మ్యాచ్ స్వరూపాన్నే మార్చగలడు.