Neeraj Chopra Marriage : ఓ ఇంటి వాడైన నీరజ్ చోప్రా.. పెళ్లి కూతురు ఎవరంటే ?
Neeraj Chopra Marriage: భారత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా కొత్త సంవత్సరంలో తన అభిమానులకు అద్భుతమైన బహుమతిని అందించారు. జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు.
Neeraj Chopra Marriage: భారత ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా కొత్త సంవత్సరంలో తన అభిమానులకు అద్భుతమైన బహుమతిని అందించారు. జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. నీరజ్ చోప్రా ఓ ఇంటి వాడయ్యాడు. అతని జీవితంలో కొత్త ఇన్నింగ్స్ ప్రారంభమైంది. నీరజ్ భార్య పేరు హిమాని. జనవరి 19 ఆదివారం నాడు నీరజ్ తన పెళ్లికి సంబంధించిన మూడు ఫోటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో షేర్ చేయడం ద్వారా తన అభిమానులకు ఈ విషయాన్ని తెలియజేశాడు.
27 ఏళ్ల నీరజ్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో తన భార్య హిమాని వేదికపై కూర్చుని ఉన్న ఫోటోను షేర్ చేశాడు. అక్కడ కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రమే కనిపించారు. తన తల్లితో కలిసి దిగిన ఫోటోను కూడా పోస్ట్ చేశాడు. నీరజ్ ఇలా రాసుకొచ్చాడు.. “నా కుటుంబంతో జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నాను. అందరి ఆశీస్సులే మమ్మల్ని ఈ క్షణానికి చేర్చాయి." అని పేర్కొన్నారు.
ప్రస్తుతం నీరజ్ భార్య హిమాని ఎవరు, ఆమె ఏమి చేస్తుందనే దాని గురించి ఎటువంటి సమాచారం లేదు. నీరజ్ కూడా దీని గురించి ఏమీ వెల్లడించలేదు. వారిద్దరికీ పాత సంబంధం ఉందా లేదా తన కుటుంబం ఎంపిక చేసిన అమ్మాయిని వివాహం చేసుకున్నాడా అనేది తెలియాల్సి ఉంది.
టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించి చరిత్ర సృష్టించారు నీరజ్ చోప్రా. ఆయన వివాహం కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. చాలా ఇంటర్వ్యూలలో ఎప్పుడు పెళ్లి చేసుకుంటారని అడిగినప్పుడల్లా సమాధానం దాటేసుకుంటూ వచ్చారు. అతని కుటుంబ సభ్యులను వివాహం గురించి అడిగినప్పుడు, వారు కూడా ఎప్పుడూ దాటేసేవారు. హర్యానాలోని పానిపట్ జిల్లాలోని ఖంద్రా గ్రామానికి చెందిన నీరజ్ చోప్రా.. జావెలిన్ త్రోలో భారతదేశానికి కొత్త గుర్తింపును తెచ్చిపెట్టాడు. అతను మొదట 2016లో అండర్-20 ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌ను గెలుచుకోవడం ద్వారా పాపులారిటీ సంపాదించాడు. ఆ తర్వాత 2018లో కామన్వెల్త్ గేమ్స్, ఆసియా క్రీడల్లో కూడా బంగారు పతకాలు సాధించాడు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో నీరజ్ 87.58 మీటర్లు విసిరి బంగారు పతకం సాధించాడు. అథ్లెటిక్స్‌లో ఒలింపిక్ పతకం, ముఖ్యంగా స్వర్ణం గెలుచుకున్న తొలి భారతీయుడిగా నిలిచాడు. ఆ తర్వాత పారిస్ ఒలింపిక్స్‌లో రజత పతకం సాధించాడు. నీరజ్ ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ అండ్ డైమండ్ లీగ్‌ను గెలుచుకున్న తొలి భారతీయుడిగా రికార్డు నెలకొల్పాడు.