Mustafizur Rahman : ముస్తాఫిజుర్ కోసం కోట్ల ఖర్చు..కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ పై దేశద్రోహి ముద్ర

ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చుట్టూ భారీ వివాదం నెలకొంది.

Update: 2026-01-03 05:05 GMT

Mustafizur Rahman : ముస్తాఫిజుర్ కోసం కోట్ల ఖర్చు..కేకేఆర్ ఓనర్ షారుఖ్ ఖాన్ పై దేశద్రోహి ముద్ర

Mustafizur Rahman : ఐపీఎల్ 2026 ప్రారంభానికి ముందే కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు చుట్టూ భారీ వివాదం నెలకొంది. బంగ్లాదేశ్ స్టార్ పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్‌ను రూ. 9.20 కోట్లకు కొనుగోలు చేయడమే ఈ రచ్చకు కారణమైంది. అటు సోషల్ మీడియాలో, ఇటు రాజకీయ వర్గాల్లో ఈ అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అసలు ఈ వివాదం ఎందుకు మొదలైంది? షారుఖ్ ఖాన్‌ను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? అనే పూర్తి వివరాలు తెలుసుకుందాం.

బంగ్లాదేశ్‌లో ఇటీవల హిందూ మైనారిటీలపై జరిగిన దాడులు, ముఖ్యంగా ఇద్దరు యువకుల హత్యకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటనలు భారతీయుల్లో తీవ్ర ఆగ్రహాన్ని కలిగించాయి. ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల మధ్య, కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు బంగ్లాదేశ్‌కు చెందిన ముస్తాఫిజుర్ రెహమాన్‌ను భారీ ధరకు కొనుగోలు చేయడం చాలా మందికి నచ్చలేదు. "హిందువులపై దాడులు చేస్తున్న దేశానికి చెందిన ఆటగాడిని మనం ఎందుకు ప్రోత్సహించాలి?" అనే ప్రశ్న నెటిజన్ల నుంచి మొదలై, రాజకీయ రంగు పులుముకుంది.

ఈ వివాదంలో కేకేఆర్ సహ యజమాని షారుఖ్ ఖాన్ ప్రధానంగా విమర్శల పాలయ్యారు. బీజేపీ నాయకుడు సంగీత్ సింగ్ సోమ్ మాట్లాడుతూ.. షారుఖ్‌ను దేశద్రోహి అని సంబోధించారు. "భారత ప్రజల వల్ల స్టార్‌గా ఎదిగి, భారత్ కు వ్యతిరేకంగా పని చేసే దేశాల ఆటగాళ్లపై కోట్లు ఖర్చు చేయడం ఏంటి?" అని ఆయన ప్రశ్నించారు. అలాగే ఆధ్యాత్మిక గురువులు దేవకీనందన్ ఠాకూర్, జగద్గురు రాంభద్రాచార్య వంటి వారు కూడా షారుఖ్ నిర్ణయాన్ని తప్పుబట్టారు. ఆ రూ.9.20 కోట్లను బంగ్లా హింసలో బాధితులైన కుటుంబాలకు ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు.

ఇంత గొడవ జరుగుతున్నా, భారత క్రికెట్ నియంత్రణ మండలి మాత్రం ఇప్పటివరకు ఎలాంటి నిషేధం విధించలేదు. బీసీసీఐ వర్గాల సమాచారం ప్రకారం.. "బంగ్లాదేశ్ మనకు శత్రు దేశం కాదు. పాకిస్థాన్ లాగా వారిపై ఎలాంటి అధికారిక నిషేధం లేదు. ప్రభుత్వం నుంచి బంగ్లా ఆటగాళ్లను అడ్డుకోవాలని మాకు ఎటువంటి ఆర్డర్స్ రాలేదు" అని స్పష్టం చేశారు. ఆటగాళ్లను ఎంపిక చేసుకోవడం అనేది ఫ్రాంచైజీల ఇష్టమని, దౌత్యపరమైన అంశాలను ప్రభుత్వం చూసుకుంటుందని బోర్డు పేర్కొంది.

ముస్తాఫిజుర్ రెహమాన్‌ను కేవలం కేకేఆర్ మాత్రమే కాదు, చెన్నై సూపర్ కింగ్స్ కూడా కొనుగోలు చేసేందుకు ప్రయత్నించింది. అతని స్లోయర్ కట్టర్లు, డెత్ ఓవర్లలో బౌలింగ్ చేసే నైపుణ్యం కారణంగానే అతని ధర 9 కోట్లు దాటింది. 2016 నుండి ఐపీఎల్ ఆడుతున్న అతను ఇప్పటివరకు 60 మ్యాచ్‌ల్లో 65 వికెట్లు తీశాడు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అతను స్టేడియంకు వస్తే నిరసనకారులు అడ్డుకుంటామని హెచ్చరిస్తుండటం భద్రతా పరమైన ఆందోళనలను పెంచుతోంది.

Tags:    

Similar News