ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల్లో మొహమ్మద్ షమి సోదరి, ఆమె భర్త పేర్లు

Update: 2025-03-26 12:02 GMT

ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల్లో మొహమ్మద్ షమి సోదరి, ఆమె భర్త పేర్లు

Mohammed Shami's sister and brother-in-law in news: టీమిండియా ఫాస్ట్ బౌలర్ మొహమ్మెద్ షమి మరోసారి వార్తల్లోకెక్కారు. అయితే, ఈసారి ఆయన వార్తల్లో రావడానికి క్రికెట్‌తో సంబంధం లేదు. అసలు విషయం ఏంటంటే... మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం లబ్ధిదారుల జాబితాలో షమి సోదరి షబినా, ఆమె భర్త ఇద్దరూ తమ పేర్లు నమోదు చేయించుకున్నారని వార్తలొస్తున్నాయి.

ఉత్తర్ ప్రదేశ్‌లోని అమ్రోహలో ఉపాధి హామీ పథకంలో తమ పేర్లు నమోదు చేయించుకోవడమే కాకుండా 2021 నుండి 2024 వరకు ప్రభుత్వం నుండి కూలీ డబ్బులు కూడా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వ రికార్డులే ఈ విషయాన్ని ధృవీకరిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నప్పటికీ ఇప్పటివరకు షమీ కానీ లేదా ఆయన కుటుంబం కానీ ఈ వార్తలపై స్పందించలేదు.

ఇక మొహమ్మెద్ షమీ కెరీర్ విషయానికొస్తే, ప్రస్తుతం షమీ సన్‌రైజర్స్ హైదరాబాద్ తరుపున ఐపిఎల్ 2025 ఆడుతున్నాడు. ఐపిఎల్ వేలంలో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు రూ. 10 కోట్లు షమిని కొనుగోలు చేసింది. ఐపిఎల్ 2025 లో భాగంగా ఉప్పల్ స్టేడియంలో జరిగిన రెండో మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడ్డాయి.

ఈ మ్యాచ్‌లో సన్ రైజర్స్ జట్టు 44 పరుగుల తేడాతో రాజస్తాన్‌పై విజయం సాధించింది. రాజస్థాన్ ఆటగాడు నితీష్ రానాను 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్దే షమీ ఔట్ చేశాడు. షమి మొత్తంగా ఈ మ్యాచ్‌లో 33 పరుగులు ఇచ్చాడు.

రాజస్తాన్ రాయల్స్ జట్టు బ్యాటింగ్ చేసే సమయంలో ఫీల్డింగ్‌లో ఉన్న షమి గాయపడ్డాడు. 12వ ఓవర్లో కెప్టేన్ ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లో క్యాచ్ పట్టబోయిన షమి చేతి వేలికి గాయమైంది. దాంతో షమి ఫీల్డింగ్‌కు కూడా దూరమయ్యాడు. కానీ అప్పటికే 3 ఓవర్లు వేసి రానా వికెట్ తీసుకున్నాడు. 

Tags:    

Similar News