World Boxing: తెలుగోడి పంచ్ పవర్ కు మాటల్లేవ్.. ప్రపంచ బాక్సింగ్ క్వార్టర్స్ లోకి హుసాముద్దీన్..!
World Boxing: ప్రతిష్టాత్మక బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ హవా కొనసాగుతోంది.
World Boxing: తెలుగోడి పంచ్ పవర్ కు మాటల్లేవ్.. ప్రపంచ బాక్సింగ్ క్వార్టర్స్ లోకి హుసాముద్దీన్..!
World Boxing: ప్రతిష్టాత్మక బాక్సింగ్ ప్రపంచ ఛాంపియన్ షిప్ లో భారత్ హవా కొనసాగుతోంది. యువ బాక్సర్ మహమ్మద్ హుసాముద్దీన్ పతకం సాధించేందుకు అడుగు దూరంలో నిలిచాడు. ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తు చేస్తున్న ఈ నిజామాబాద్ చిచ్చరపిడుగు మెగా టోర్నీలో క్వార్టర్ ఫైనల్స్ కు దూసుకెళ్లి పతకం ఖాయం చేసుకున్నాడు. చైనా బాక్సర్ పింగ్ పై పంచ్ లతో విరుచుకుపడ్డ హుసాముద్దీన్..ప్రి క్వార్టర్స్ లోనూ అదే దూకుడు ప్రదర్శించాడు.
57 కేజీల విభాగం ప్రీ క్వార్టర్స్ లో రష్యా బాక్సర్ ఎడ్వర్డ్ సావిన్ తో హుసాముద్దీన్ తలపడ్డాడు. ఈ పోరులో 5-0 తేడాతో రష్యా బాక్సర్ ఎడ్వర్డ్ సావిన్ ను చిత్తుగా ఓడించాడు. ఈ తెలుగోడి పంచ్ పవర్ కు ప్రత్యర్థి పూర్తిగా తలవంచాడు. ఆట ప్రారంభం నుంచే హుసాముద్దీన్ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చూపిస్తూ..పవర్ ఫుల్ పంచ్ లతో రెచ్చిపోయాడు. హుసాముద్దీన్ ధాటికి సావిన్ ఏమాత్రం నిలవలేకపోయాడు.
హుసాముద్దీన్ క్వార్టర్స్ లో అజర్ బైజాన్ కు చెందిన బాక్సర్ ఉమిద్ రుస్తమోవ్ తో తలపడనున్నాడు. మరో భారత బాక్సర్ దీపక్ బోరియా కూడా తన సత్తా చాటుకుంటున్నాడు. 51 కేజీల విభాగంలో పోరాడుతున్న దీపక్..ప్రి క్వార్టర్స్ కు చేరాడు. టోక్యో ఒలింపిక్స్ లో కాంస్యం గెలిచిన కజకిస్థాన్ బాక్సర్ సాకెన్ బిబోసినోవ్ ను దీపక్ 5-2 తేడాతో ఓడించి ప్రిక్వార్టర్స్ లో అడుగుపెట్టాడు.