T20 World Cup 2026 : ఆనాడు ముంబై రైల్వే స్టేషన్‌లో అరెస్ట్..నేడు నెదర్లాండ్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన హర్మీత్
ఆనాడు ముంబై రైల్వే స్టేషన్‌లో అరెస్ట్..నేడు నెదర్లాండ్స్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన హర్మీత్
T20 World Cup 2026 : టీ20 ప్రపంచ కప్ 2026లో మరో ఆసక్తికరమైన ఫలితం నమోదైంది. పసికూనగా భావించిన అమెరికా జట్టు అదరగొట్టింది. నెదర్లాండ్స్‌తో జరిగిన కీలక పోరులో అమెరికా ఏకంగా 93 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. ఈ విజయంతో టోర్నీలో అమెరికా తన తొలి విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అయితే ఈ గెలుపులో హీరోగా నిలిచిన ఆటగాడి నేపథ్యం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.
అమెరికా బ్యాటర్ల విధ్వంసం
చెన్నైలోని చెపాక్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన నెదర్లాండ్స్ మొదట అమెరికాను బ్యాటింగ్‌కు ఆహ్వానించింది. గతంలో భారత్, పాకిస్థాన్‌లపై తడబడిన అమెరికా బ్యాటర్లు ఈసారి మాత్రం రెచ్చిపోయారు. ముఖ్యంగా సైతేజ ముక్కామల (79 రన్స్, 51 బంతులు) అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో డచ్ బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. మరోవైపు శుభమ్ రంజనే కేవలం 24 బంతుల్లోనే 48 పరుగులు చేసి అమెరికా స్కోరును 20 ఓవర్లలో 196 పరుగులకు చేర్చాడు.
హర్మీత్ సింగ్ స్పిన్ మ్యాజిక్
197 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నెదర్లాండ్స్ జట్టు అమెరికా బౌలర్ల దాటికి విలవిలలాడింది. భారత సంతతికి చెందిన లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ హర్మీత్ సింగ్ తన స్పిన్ మంత్రంతో నెదర్లాండ్స్ వెన్ను విరిచాడు. హర్మీత్ కేవలం 21 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అతడికి తోడుగా షాక్విక్ 3 వికెట్లు తీశాడు. దీంతో నెదర్లాండ్స్ కేవలం 103 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
ఎవరీ హర్మీత్ సింగ్? అప్పట్లో ఏమైంది?
హర్మీత్ సింగ్ గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక పాత వార్త వైరల్ అవుతోంది. హర్మీత్ అసలు ముంబైకి చెందిన ఆటగాడు. గతంలో భారత్‌లో దేశవాళీ క్రికెట్ ఆడేవాడు. అయితే 2017 ఫిబ్రవరిలో ఒక వింత సంఘటన జరిగింది. హర్మీత్ తన కారును పొరపాటున ముంబైలోని అంధేరి రైల్వే స్టేషన్ ప్లాట్‌ఫారమ్ మీదకు నడిపాడు. దీంతో రైల్వే పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. అయితే అది పొరపాటున జరిగిందని తేలడంతో తర్వాత విడుదలయ్యారు. 2019లో భారత్ వదిలి అమెరికా వెళ్లిన హర్మీత్, ఇప్పుడు అదే అమెరికా జట్టుకు స్టార్ బౌలర్‌గా మారడం విశేషం.