Vaibhav Suryavanshi: వరల్డ్ కప్ విన్నర్.. ఇప్పుడు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్: వైభవ్ సూర్యవంశీ 'పరీక్ష' సమయం!
Vaibhav Suryavanshi: అండర్-19 ప్రపంచకప్ హీరో వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి బిహార్‌లోని తన సొంత స్కూల్‌లో పరీక్షలు రాయనున్నాడు. ఐపీఎల్ మరియు వరల్డ్ కప్‌లో రికార్డులు సృష్టించిన వైభవ్ పై స్పెషల్ రిపోర్ట్.
Vaibhav Suryavanshi: అండర్-19 వన్డే ప్రపంచకప్‌లో భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన యువ కెరటం వైభవ్ సూర్యవంశీ (Vaibhav Suryavanshi) ఇప్పుడు తన విద్యాభ్యాసంపై దృష్టి సారించాడు. ప్రపంచకప్ ముగియగానే తీరిక లేకుండా తన పదో తరగతి బోర్డు పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
బిహార్‌లోని సమస్తిపుర్ జిల్లా పోడార్ ఇంటర్నేషనల్ స్కూల్‌లో వైభవ్ ఈ పరీక్షలు రాయనున్నాడు. ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభం కానున్న ఈ పరీక్షల కోసం పాఠశాల యజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. వైభవ్ ప్రస్తుతం స్టార్ క్రికెటర్ కావడంతో, పాఠశాల వద్ద అభిమానుల తాకిడి పెరిగే అవకాశం ఉందని భావించి పటిష్ట భద్రతా చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ నీల్ కిశోర్ తెలిపారు. ఇతర విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన పేర్కొన్నారు.
గత ఐపీఎల్ సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతూ కేవలం 35 బంతుల్లోనే సెంచరీ బాది ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఇటీవల జరిగిన అండర్-19 ప్రపంచకప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్‌పై వీరవిహారం చేశాడు. కేవలం 80 బంతుల్లోనే 175 పరుగులు చేసి భారత్‌కు కప్పు అందించాడు. మైదానంలో బౌలర్లను వణికించిన ఈ కుర్రాడు, ఇప్పుడు పరీక్షల హాల్‌లో పెన్నుతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి!